దాహార్తికి శాశ్వత పరిష్కారం.
వేసవి సమీపిస్తున్న వేళ తాగునీటి కష్టాలకు ముగింపు.
గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ చొరవతో నూతన బోరు ఏర్పాటు. - హర్షం వ్యక్తం చేస్తున్న 11వ వార్డు ప్రజలు.
లోకల్ గైడ్/తాండూర్:
కొంత కాలంగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న 11వ వార్డు ప్రజలకు, శాశ్వత పరిష్కారం కల్పించేందుకు గ్రామ సర్పంచ్ డివై. చిన్న నరసింహులు, ఉప సర్పంచ్ డివై ప్రసాద్ చర్యలు చేపట్టారు. శుక్రవారం పెద్దేముల్ గ్రామంలోని 11వ వార్డు ప్రజల కోసం నూతన బోరు వేయించారు. ఈ క్రమంలో నూతన బోరులో పుష్కలంగా నీరు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ...
వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య ఉందనీ తమ దృష్టికి రావడంతో బోర్ వేయించినట్లు తెలిపారు. కొత్త బోరు ద్వారా ప్రతి రోజు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు.కాగా చాలా కాలం నుంచి తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎస్సీ కాలనీకి నూతన బోరు వేయడంతో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డివై నరసింహులు, ఉప సర్పంచ్ డివై ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి లాలప్ప, వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
