అశ్వారావుపేటలో ప్రతిపక్షం అడ్రస్ గల్లంతు?
ప్రజా సమస్యలు గాలికి! ఫంక్షన్లకే పరిమితమైన నేతలు!
ప్రశ్నించే గొంతుక ఏది? సామాన్యుడి గోడు పట్టించుకోని విపక్షంపై ప్రజల ఆగ్రహం.
అశ్వారావుపేట, లోకల్ గైడ్ :
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అంటే ప్రజల తరపున పోరాడే ఒక కవచం. అధికార పార్టీ దారి తప్పినప్పుడు కడిగిపారేసే అంకుశం. కానీ, అశ్వారావుపేట మండలంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ ప్రతిపక్షం ఉందా? అన్న అనుమానం సగటు పౌరుడికి కలుగుతోంది. ప్రజా సమస్యలు పుట్టెడు ఉన్నా, అధికార పార్టీ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నా, ప్రతిపక్ష నేతలు మాత్రం కేవలం ఫంక్షన్లు, పార్టీలు, శుభకార్యాలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో మిగిలిన రాజకీయ పార్టీల ధోరణి కూడా ఈ విధంగానే ఉందని బాధిత ప్రజలు ఆరోపిస్తున్నారు. అశ్వారావుపేట నడిబొడ్డున ఉన్న దొంతికుంట చెరువు కబ్జాకు గురవుతుంటే, ఐదు కోట్ల రూపాయల ప్రజా ధనంతో ఆ ఆక్రమణలను చట్టబద్ధం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. రైతుల కాలువలు పూడ్చివేసి ఆయకట్టును దెబ్బతీస్తుంటే, అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రతిపక్ష పార్టీ కనీసం ఒక వినతిపత్రం ఇవ్వడానికి గానీ, ధర్నా చేయడానికి గానీ ముందుకు రాకపోవడం వెనుక ఉన్న లోపాయికారీ ఒప్పందాలేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పనులు మొదలై ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావట్లేదు. నిత్యం దుమ్ము, ధూళి, కాలుష్యంతో ప్రజలు రోగాల పాలవుతున్నారు. అధికారులు, అధికార పార్టీ నాయకులు లాభనష్టాల బేరీజు వేసుకుంటూ కాలక్షేపం చేస్తుంటే, ప్రతిపక్షం నోరు మెదపడం లేదు. ప్రజల ఆరోగ్యం కంటే నాయకులకు తమ వ్యక్తిగత సంబంధాలే ముఖ్యమయ్యాయా? రెండు ఎకరాల స్థలంలో సుమారు 300 మంది పేదల ఇళ్లను కనీసం నోటీసు ఇవ్వకుండా నేలమట్టం చేసిన ఉదంతం అశ్వారావుపేటలో కలకలం రేపింది. గూడు కోల్పోయిన పేదవాడి కన్నీరు తుడువాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి లేదా? రాజకీయ లబ్ధి కోసం కాకపోయినా, మానవత్వంతోనైనా వారి పక్షాన నిలబడాల్సిన నేతలు ఫంక్షన్లలో బిజీగా ఉండటం శోచనీయమని, రామన్నగూడెం భూ సమస్యలు దశాబ్దాలుగా నలుగుతున్నాయని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చి రెండేళ్లు దాటినా బిల్లా దాఖల భూముల పట్టాల ఊసే లేదని, ఉడుముల బండ వలస ఆదివాసి గిరిజనులపై అటవీ అధికారుల దాస్యకం కొనసాగుతుందని, అటవీ భూముల పట్టాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, మరోవైపు మండలంలో బెల్టు షాపులు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయని, ఇంతటి అస్తవ్యస్త పరిస్థితుల్లోనూ ప్రతిపక్షం మౌనమే నీ భాష అన్నట్లు వ్యవహరిస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు. నీవు అధికారంలో ఉంటే నేను సహకరిస్తా నేను ఉంటే నువ్వు సహకరించు అన్నట్లుగా వాటాలు పంచుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని సామాన్య ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ప్రతిపక్షం అంటే కేవలం ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చే యంత్రం కాదు. ప్రజల సమస్యల మీద ఉద్యమిస్తేనే భవిష్యత్తులో వారికి అధికారం సిద్ధిస్తుందని ప్రజలు నొక్కి చెబుతున్నారు. అశ్వారావుపేట ప్రతిపక్ష నేతలు ఇకనైనా ఏసీ గదుల నుంచి, ఫంక్షన్ల హంగామా నుంచి బయటకు రావాలని, క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను చూడాలని, రాజ్యాంగం కల్పించిన ప్రతిపక్ష హోదాకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో, చరిత్రలో అడ్రస్ లేని పార్టీలుగా మిగిలిపోక తప్పదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
