గురువయ్య గౌడ్‌కు కేంద్ర ప్రభుత్వ అదనపు న్యాయవాదిగా నియామకం
న్యాయం సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని గురువయ్య గౌడ్ తెలిపారు.
మిడ్జిల్ జనవరి 21:(లోకల్ గైడ్):
తెలంగాణ హైకోర్టు రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో న్యాయవాదిగా విశిష్ట సేవలు అందిస్తున్న సీనియర్ అడ్వొకేట్ బండారి గురువయ్య గౌడ్‌ను కేంద్ర ప్రభుత్వం అదనపు న్యాయవాదిగా నియమించినట్లు బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన వివిధ కేసుల్లో హైకోర్టులో ప్రభుత్వ తరపున బలమైన వాదనలు వినిపిస్తూ న్యాయం సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని గురువయ్య గౌడ్ తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నియామకంపై ఆయన స్వగ్రామమైన మిడ్జిల్ మండలం వేముల గ్రామ ప్రజలు, బాల్య మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినందుకు గురువయ్య గౌడ్‌ను ఘనంగా సన్మానించారు.
‘మా ఊరి బిడ్డ ఈ స్థాయికి ఎదగడం గర్వకారణం అని బాల్య మిత్రులు శేఖర్, సి ఐ అంజిరెడ్డి మిడ్జిల్ సర్పంచ్ శంకర్, బుచ్చిరెడ్డి, కృష్ణ, సంపత్, ఉస్మాన్ తదితరులు ఆనందం వ్యక్తం చేశారు.
