శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
మియాపూర్ మయూరి నగర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్‌లో శనివారం ఉమ్మడి పాలమూరు జిల్లా ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పేరి వెంకట్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమం ఐక్యవేదిక తాత్కాలిక అధ్యక్షులు కె. కోటయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని పేరి వెంకట్ రెడ్డి ఉపాధ్యాయ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయి బాధ్యతలు చేపట్టడం గర్వకారణమని తెలిపారు. ఆయనకు శాలువా, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇలాగే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని సభ్యులు ఆకాంక్షించారు. ఇదే కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి మియాపూర్ ఎం.ఎన్.నగర్‌లో కుటుంబంతో నివాసం ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్న శర్మందా అనే వ్యక్తి గత నెలలో రోడ్డు ప్రమాదంలో మరణించగా, అతని కుటుంబానికి ఉమ్మడి పాలమూరు జిల్లా ఐక్యవేదిక తరఫున రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఐక్యవేదిక నాయకులు, సభ్యులు, మయూరి నగర్ అసోసియేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.