భూమి కోసం భిక్షాటన!
రామన్నగూడెం ఆదివాసీల వినూత్న నిరసన
తొమ్మిది రోజులుగా కలెక్టరేట్ ముందు నిరవధిక నిరాహార దీక్షలో
అశ్వారావుపేట, లోకల్ గైడ్ :
చెట్టూ పుట్టను నమ్ముకుని బతికే అడవి బిడ్డలు నేడు అక్షరాలా రోడ్డున పడ్డారు. తమకు వారసత్వంగా రావాల్సిన భూమి కోసం, దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ సాక్షిగా ఆదివాసీలు చేస్తున్న పోరాటం నేటికి 9వ రోజుకు చేరుకుంది. అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామ ఆదివాసీలు చేస్తున్న ఈ నిరవధిక నిరాహార దీక్షలు ప్రభుత్వ మొండి వైఖరికి పరాకాష్టగా నిలుస్తున్నాయి. తొమ్మిది రోజులుగా అన్నపానీయాలు వదిలేసి, పిల్లాపాపలతో సహా కలెక్టరేట్ ముంగిట దీక్ష చేస్తున్నా ఏ ఒక్క అధికారి గానీ, ప్రజాప్రతినిధి గానీ వచ్చి వారి సమస్యను విన్నవించుకోకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. మా భూములు మాకు అప్పగించే వరకు కదిలేది లేదని భీష్మించుకున్న ఆదివాసీలకు కనీసం ఆహారం కూడా లేని పరిస్థితి నెలకొంది. దీంతో గత్యంతరం లేక మంగళవారం నాడు ఆదివాసీ మహిళలు, చిన్నారులు కొత్తగూడెం పట్టణ వీధుల్లో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. చేతిలో చిప్ప పట్టి వారు అడిగేది భిక్షం కాదు, తమ హక్కుగా రావాల్సిన భూమి! కంటతడి పెట్టిస్తున్న చిన్నారుల రోదన రామన్నగూడెం గ్రామ ప్రజలు ఊరు వాడ ఏకమై ఇళ్లను వదిలి ఇక్కడికి వచ్చారు. మాడి దుర్గ, కోర్స వీరమ్మ, సోరేం లక్ష్మి, నారం రాజకుమారి వంటి మహిళలతో పాటు పసిపిల్లలు కూడా ఎండలో ఎండుతూ, ఆకలితో అలమటిస్తూ దీక్షలో కూర్చోవడం చూస్తుంటే స్థానికులు కంటతడి పెట్టుకుంటున్నారు. జిల్లా యంత్రాంగం ఇంతటి అమానవీయంగా వ్యవహరించడంపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. ఆదివాసీల పట్ల ప్రభుత్వానికి ఉన్న చులకన భావన వల్లే ఈ సమస్య ఇంత కాలం నలుగుతోందని సామాజిక సంఘాలు వేలెత్తి చూపుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి రామన్నగూడెం భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే ఈ ఉద్యమం జిల్లా వ్యాప్తంగా ఉధృతం అవుతుందని హెచ్చరిస్తున్నారు. అధికారులు ఏసీ గదుల్లో ఫైళ్లు తిరగేస్తుంటే అడవి బిడ్డలు ఆకలితో రోడ్ల మీద భిక్షాటన చేస్తున్నారు. ఇది అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి గర్వకారణమా? లేక వ్యవస్థల వైఫల్యమా? రామన్నగూడెం ఆదివాసీల భూమి పోరాటానికి ప్రభుత్వం ఎప్పుడు సమాధానం చెబుతుందో వేచి చూడాలి.
