అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి.
పదో తరగతి విద్యార్థులు చదవాలి.. రాయాలి. కలెక్టర్ గరిమ అగ్రవాల్
పీఎంశ్రీ కింద ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ జడ్పీ హై స్కూల్ లో పనులు, ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లా,లోకల్ గైడ్ తెలంగాణ:
పీఎంశ్రీ కింద ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలోని జడ్పీ హై స్కూల్ లో అదనపు తరగతి గదులు, సైన్సు ల్యాబ్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. పీఎంశ్రీ కింద బొప్పాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత విద్యాలయంలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు, సైన్సు ల్యాబ్ నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను పరిశీలించి, అధికారులు, కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేశారు. పనుల్లో మరింత వేగం పెంచాలని, రానున్న 20 రోజుల్లో పూర్తి చేసి, వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రస్తుతం విద్యాలయంలో విద్యార్థులు సంఖ్య, ఎన్ని తరగతి గదులు ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పదో తరగతి విద్యార్థుల క్లాసు రూమ్ కు వెళ్లి వారితో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి విద్యార్థికి పదో తరగతి కీలకమని తెలిపారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు చదవాలని, సమాధానాలు రాయాలని సూచించారు.
ఆ సమాధానాలు మరోసారి సమీక్ష చేసుకొని, ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని పేర్కొన్నారు. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.
ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి సిద్దం చేయాలి
ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి సిద్దం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. బొప్పాపూర్ గ్రామంలో మంద స్వరూప ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటుండగా, కలెక్టర్ పరిశీలించి, లబ్దిదారుతో మాట్లాడారు. నిర్మాణం ఎప్పుడు మొదలు పెట్టారు? రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం అందిందా అని ఆరా తీశారు. మూడు విడుతల్లో కలిపి తనకు మొత్తం రూ. నాలుగు లక్షలు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని కలెక్టర్ దృష్టికి మంద స్వరూప తీసుకువెళ్లారు. మిగతా నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని లబ్దిదారుకు కలెక్టర్ సూచించారు. తుది దశ పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు.
కార్యక్రమాల్లో జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి అఫ్జల్ బేగం, హౌసింగ్ డీఈ ముజఫర్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ సత్తయ్య, టీజీఈడబ్ల్యూఐడీసీ డీఈ సత్యనారాయణరావు, ఎంఈఓ, ఏఈలు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
