గతంలో ఎన్నడు లేని విధంగా ఎమ్మెల్యే దౌర్జన్యాలు?
ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ఎమ్మెల్యే. - ఎమ్మెల్యే చర్యలపై ప్రజల్లో ఆగ్రహం.
ఆయనపై తక్షణమే కేసు నమోదు చేయాలి. - మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.
లోకల్ గైడ్/తాండూర్:
గతంలో ఎన్నడూ లేని విధంగా కనివిని ఎరుగని రీతిలో ఎమ్మెల్యే,ఆయన అనుచరులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తాండూర్ పట్టణంలోని ఆయన నివాసంలో విలేకారుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలుకొని, ఫలితాలు వెలువడే వరకు బిఆర్ఎస్ నాయకులపై దాడులు, దౌర్జన్యాలు చేశారని ఆరోపించారు. ఇలాంటి రాజకీయాలను తాండూర్ ప్రజలు ఎన్నడూ చూడలేదని అన్నారు. కౌంటింగ్ రోజు అయితే ఫలితాలు వెలువడక ముందే... కౌంటింగ్ హాల్లోకి చొరబడి పోలీసులను భయభ్రాంతులకు గురి చేశారని దుయ్యబడ్డారు. తక్షణమే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, వారి అనుచరుల పైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
