ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందించాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష నిర్లక్ష్యం వహించినా, డబ్బులు ఆశించినా కఠిన చర్యలు
పోస్టుమార్టం ప్రక్రియలు పూర్తిగా ఉచితం — ఎవరూ డబ్బులు తీసుకోకూడదు ఆసుపత్రిలో పరిశుభ్రత, సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి
అవసరమైన పరికరాలు, సిబ్బంది సమకూర్చి సేవలను విస్తరించాలి.
పెద్దపల్లి, ఏప్రిల్ 07:(లోకల్ గైడ్)
ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందించాలని, ఆసుపత్రి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, డబ్బులు ఆశించినా కఠిన చర్యలు ఉంటాయని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,* ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి రోగికి సమయానికి నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. అవసరమైన మందులు ఎల్లప్పుడూ స్టాక్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రోగుల సౌకర్యాల కోసం గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఆర్.ఓ ప్లాంట్ ఏర్పాటు, ఆసుపత్రి అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, రోగులు మరియు వారి సహాయకుల కోసం అదనపు షెడ్ల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు.
సదారం శిబిరాన్ని ప్రత్యేక భవనానికి మార్చినట్లు తెలిపారు. అదే విధంగా జిల్లా మెడికల్ బోర్డు తరలింపును కూడా సమగ్ర ప్రణాళికతో అమలు చేయాలని సూచించారు. ఆసుపత్రిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని విభాగాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వైద్యులు సమయానికి హాజరు కావడం నిర్ధారించుకోవాలని, వివిధ విభాగాలలో ఉన్న ఖాళీలను అవుట్‌సోర్సింగ్ విధానంలో త్వరితగతిన భర్తీ చేయాలని తెలిపారు. ఆసుపత్రి సేవలు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
రాష్ట్ర స్థాయిలో డయాగ్నస్టిక్ హబ్ ద్వారా ఆరోగ్య పరీక్ష ఫలితాల అందజేతలో పెద్దపల్లి జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్ తెలిపారు. ఈ స్థాయిని మరింత మెరుగుపర్చేందుకు గోదావరిఖని జనరల్ ఆసుపత్రికి అవసరమైన పరికరాల జాబితాను అంచనాలతో సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు.
ఈఎన్‌టి విభాగానికి సంబంధించి అవసరమైన పరికరాలు సమకూర్చి, ఓపీ సేవలు ఆలస్యం లేకుండా రోగులకు అందించాలని సూచించారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకంపై ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో లిఫ్ట్ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వార్డులకు సంబంధించిన వైద్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు తీసుకోకుండా ఉచిత వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. *పోస్టుమార్టం ప్రక్రియలు పూర్తిగా ఉచితంగా జరగాలని, ఎవరైనా డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.* ఫోరెన్సిక్ విభాగంలో వైద్యుల కొరత ఉన్నందున అవసరానికి అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు.
ఆరోగ్యశ్రీ పథకం కింద వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి రోగికి ఉచితంగా మరియు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.
ఆసుపత్రి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, వ్యర్థాల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రికి కలెక్టర్ అందజేసిన 20 ఏసీలు, 23 ఫ్రిజ్‌లను రోగుల అవసరాలకు అనుగుణంగా సమర్థవంతంగా వినియోగించుకోవాలని, రోగులు, వారి బంధువులు ఎవరూ నిల్చోకుండా అందరూ కూర్చునే విధంగా తగిన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రి నుంచి వచ్చే బయోడిగ్రేడబుల్ చెత్త నిబంధనల ప్రకారం డిస్పోస్ చేయాలని కలెక్టర్ సూచించారు. వివిధ విభాగాల హెచ్ ఓ డి లు ప్రతి నెల ఎన్ని ఆపరేషన్స్ చేస్తున్నారో రికార్డు అందించాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-------------------------------------------
