రంజాన్ పండగ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్షించారు.
నారాయణపేట జనవరి 22:
వచ్చే నెలలో ప్రారంభమయ్యే పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఆచరించే ఉపవాస దీక్షలకు( రోజా), రంజాన్ పండగ రోజు కల్పించాల్సిన ఏర్పాట్ల పై గురువారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్షించారు.ఈ సమీక్షలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా రంజాన్ మాసాన్ని, పండగను ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని, రంజాన్ మాస ఉపవాస దీక్షలకు అవసరమైన వసతి, సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆమె ఆదేశించారు. సమావేశంలో మైనార్టీ నాయకులు మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా నెల రోజుల పాటు పట్టణంలో తాగునీటి సరఫరా, విద్యుత్, పారిశుద్ధ్యం మెరుగు పర్చాలని కోరారు. ముఖ్యంగా ఆ నెల మొత్తం విద్యుత్ సరఫరా కు ఆటంకం లేకుండా ఆ శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వీటితో పాటు మసీదులు, ఈద్గాల వద్ద రోజూ సాయంత్రం మున్సిపాలిటీ చెత్త ఆటో రిక్షా ను అందుబాటులో ఉంచాలని, ఇప్తార్ ముగిసిన తర్వాత వ్యర్థ పదార్థాలను ఆ ఆటో రిక్షాల లో వేస్తారని లేదంటే ఆయా ప్రాంతాల్లో దుర్గంధం నెలకొంటుందని చెప్పారు. రంజాన్ పండగ కు పది రోజుల ముందు పట్టణంలో దుకాణాలు రాత్రి వేళల్లో తెరచి ఉంచేందుకు అనుమతి ఇవ్వాలని, పండగ షాపింగ్ ఎక్కువగా రాత్రి వేళల్లోనే చేస్తారని మైనార్టీ నాయకులు తెలిపారు. రంజాన్ పండగ రోజు ఈద్గా వద్ద షామియానాలు, టెంట్లు, తాగునీటి వసతి కల్పించాలని వారు కోరారు. రంజాన్ పండగ రోజు ఈద్గా వద్ద కు రావాలని జిల్లా కలెక్టర్ ను నాయకులు కోరారు. మైనార్టీ నాయకులు కోరిన వాటిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. శాఖల వారీగా అధికారులు ఆయా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామంలోనూ తగిన ఏర్పాట్లు చేయాలని డిపివో సుధాకర్ రెడ్డి కి కలెక్టర్ సూచించారు. అయితే రంజాన్ నెలలోనే హోలీ పండుగ వస్తుందని, పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ముందస్తు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. రంజాన్ పండగ సందర్భంగా పోలీసు శాఖ ఇచ్చిన రాత్రి సమయం సడలింపును కొందరు యువకులు దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉందని, అలా జరగకుండా ముస్లిం మత పెద్దలు పోలీసు శాఖకు సహకరించాలని డీ ఎస్పీ కోరారు. ఏదైనా చిన్న సంఘటన జరిగినా పట్టణ పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఎస్పీ డాక్టర్ వినీత్ మైనార్టీ నాయకులకు సూచించారు. జిల్లాలో పోలీసు స్టేషన్ ల వారీగా శాంతి సమావేశాలు ఏర్పాటు చేసి, పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. కాగా రంజాన్ నెలలో విద్యుత్ సరఫరా కు అంతరాయం కలిగితే విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ 8712470307 ను సంప్రదించాలని విద్యుత్ శాఖ అధికారి కోరారు.
ఈ సమావేశంలో ఆర్డీవో రామచందర్ నాయక్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఎం.ఏ. రషీద్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శైలజ, మున్సిపల్ మేనేజర్ అజీమ్, మైనార్టీ నాయకులు అమీరొద్దీన్, సర్ఫరాజ్ అన్సారి, మహిముద్ ఖురేషీ, అజీమ్ మడ్కీ, ఫిరోజ్,మహిముద్,అజహర్, ఎం.ఐ.ఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్, పట్టణ అధ్యక్షుడు తఖి, ఫీర్ తఖి తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:4.సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్
-----------------------------------------
