క్షయ వ్యాధి నిర్మూలన మన అందరి బాధ్యత.
సిద్ధిపేట అవగాహన కార్యక్రమంలో అధికారులు
సిద్దిపేట జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్ తెలంగాణ) ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా సిద్ధిపేట జిల్లా నాసర్‌పుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టిబి ముక్త్ భారత్ అభియాన్ రెండో దశ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సీహెచ్ ధనరాజ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 96 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి, 100 రోజుల పాటు ప్రతి గ్రామంలో టిబి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెచ్‌ఐవీ బాధితులు, సాధారణ ప్రజలతో పాటు 14 సంవత్సరాల పైబడిన లక్షణాలు ఉన్న వారికి తెమడ పరీక్షలు, పోర్టబుల్ ఎక్స్‌రే ద్వారా స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి వెంటనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.క్షయ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తల ద్వారా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, ప్రమాదానికి గురయ్యే వర్గాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ నిర్మల రెడ్డి మాట్లాడుతూ, డాట్స్ విధానంతో రోగులకు ఇంటివద్దే ఉచిత చికిత్స అందిస్తూ పూర్తి కోర్సు (6 నెలలు) పూర్తి చేయించేందుకు చర్యలు
తీసుకుంటున్నామని తెలిపారు. రెండు వారాలకు మించిన దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నవారు సమీప ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.జిల్లాలో గజ్వేల్, సిద్ధిపేట జిల్లా ఆసుపత్రి, ఆర్విఎం మెడికల్ కాలేజ్, నంగునూర్, చేర్యాల్, దుబ్బాక, హుస్నాబాద్, బెజ్జంకి కేంద్రాల్లో ఉచిత టిబి పరీక్షలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే నిక్షయ పోషణ పథకం కింద రోగులకు ప్రతినెల రూ.1000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
