విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి.
డ్యూటీకి హాజరు కాని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ. మధిర ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బంది పై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
ఆదివారం మధిర ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని క్యాజువాలిటీ, ఎల్.డి.ఆర్.ఎం. రూమ్, డయాలసిస్ సెంటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ వార్డ్, రేడియాలజీ బ్లాక్, ఓపి రూమ్ లను పరిశీలిస్తూ రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవల వివరాలను ఆరా తీశారు.
రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, రోజువారీ కేసుల వివరాలు, ముఖ్యమైన రిజిస్టర్లు, నెలవారీ నివేదికలను, ఔషధాల లభ్యత, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి, సేవలు మరింత నాణ్యంగా అందేలా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* డ్యూటీలో లేని వైద్యులు, ఇతర సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి వైద్యులు హాజరు సంబంధించి రెగ్యులర్ గా రిపోర్ట్ తనకు అందించాలని కలెక్టర్ సూచించారు.
ఆసుపత్రికి రెగ్యులర్ గా వస్తున్న ఓపి వివరాలను కలెక్టర్ పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సకాలంలో అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తే ఎక్కువ మంది రోగులు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారని కలెక్టర్ తెలిపారు.
ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, అనవసరపు సి-సెక్షన్ ఆపరేషన్ చేయవద్దని అన్నారు. ఎమర్జెన్సీ వార్డ్ లో కేసు షీట్ లను పరిశీలిస్తూ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో రోగులకు రెగ్యులర్ గా అందుతున్న భోజనం నాణ్యత అంశాలను రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మధిర తహసీల్దారు రాంబాబు, సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.
