శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
యాదవ రాజు కాటమరాజు జయంతి ఉత్సవాలు-2026ను పురస్కరించుకొని ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 22 వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు. యాదవరాజు శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలు విజయవంతంగా పూర్తైన నేపథ్యంలో తదుపరి లక్ష్యంగా కాటమరాజు జయంతి వేడుకలను ప్రతి ప్రాంతంలో ప్రజాపాల్గొనడంతో నిర్వహించాలని ఆయన తెలిపారు. చంద్రవంశ క్షత్రియ యాదవ వంశానికి చెందిన ఆత్రేయ గోత్రీకుడైన కాటమరాజు, శ్రీకృష్ణ పరమాత్మ వంశానికి చెందినవాడని వీరగాథలు పేర్కొంటున్నాయని అన్నారు. గోవుల రక్షణ కోసం నల్లసిద్ధిరాజుతో జరిగిన యుద్ధంలో విజయం సాధించిన మహావీరుడు కాటమరాజు అని, దేశంలో అరుదుగా రాజులకు గుడులు ఉండగా కాటమరాజు కు దక్షిణ భారతదేశమంతటా గుడులు ఉండటం ఆయన గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు. కాటమరాజు శ్రీకృష్ణునికి 23వ తరం వారని వంశవృక్షాల ద్వారా తెలుస్తోందని, కనిగిరి ప్రాంతాన్ని పరిపాలించిన గొప్ప పరాక్రమ శాలి అని వివరించారు. కాకతీయ సామ్రాజ్య కాలంలో నల్లసిద్ధిరాజుతో జరిగిన యుద్ధంలో కాటమరాజు విజయం సాధించగా, ఈ కథాచక్రాన్ని యాదవభారతంగా పిలుస్తారని పేర్కొన్నారు. కాటమరాజు జయంతి వేడుకలు రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా నిర్వహించేలా యాదవ సమాజం ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.