ఏప్రిల్ నెలాఖరు నాటికి గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు పూర్తి.... రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు.
లాభదాయక పంటల వైపు రైతులు దృష్టి సారించాల
కొణిజెర్ల మండలం అంజనాపురంలో ఏర్పాటు చేస్తున్న గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి తుమ్మల
కొణిజెర్ల, మార్చి -15:లోకల్ గైడ్ :
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం కొణిజెర్ల మండలంలో పర్యటించి అంజనాపురంలో ఏర్పాటు చేస్తున్న గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనుల పురోగతిని, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ* స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆయిల్ పామ్ మొక్కలు తీసుకొచ్చి మొదటిసారిగా నాటడం జరిగిందని అన్నారు. అప్పటివరకు మనకు ఈ పంట లేదని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా ఆయిల్ పామ్ పంట విస్తరణ కోసం అనుమతులు తాను సాధించినట్లు మంత్రి అన్నారు.
ప్రతి ఎకరానికి 51 వేల రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం రైతులకు అందిస్తుందని అన్నారు. పంటల మార్పిడి చేసుకోలేకపోతే రైతులు ఇబ్బందులు పడతారని, ధాన్యం కొనుగోలును కేంద్ర ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తున్నదని తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలో వరి పంట వేయకపోతే డబ్బులు ఇస్తున్నారని అన్నారు. యూరియా అధిక వాడకం వల్ల పంజాబ్ లో క్యాన్సర్ ఎక్కువ అయిందని, ప్రస్తుతం మన దగ్గర కూడా యూరియా ఎక్కువగా వాడుతున్నామని దీనివల్ల నష్టాలు వస్తాయని అన్నారు. పంటల మార్పిడి విధానం రైతులు తప్పని సరిగా అనుసరించాలని లేని పక్షంలో చాలా నష్టాలు వస్తాయని మంత్రి అప్రమత్తం చేశారు.
మల్టీ నేషనల్ కంపెనీ గోద్రెజ్ వ్యవసాయ ఉత్పత్తులపై దృష్టి సారించిందని, ఏపీలో గతంలోనే ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారని ప్రస్తుతం ఖమ్మంలో ఫ్యాక్టరీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ తో పాటు ఇక్కడ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, రైతులకు ఎటువంటి సందేహాలు ఉన్న నివృత్తి చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.
ఈ నెల 22న సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ చేతుల మీదుగా జరిగే నూతనంగా నిర్మించిన నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రైతులందరూ వెళ్లాలని, అక్కడ 3 రోజుల పాటు వ్యవసాయ ప్రదర్శన ఉంటుందని అన్నారు.
సీడ్ గార్డెనింగ్ ఏర్పాటుకు కంపెనీలకు ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా సహకారం అందిస్తామని అన్నారు. సీడ్ గార్డెనింగ్ కోసం రైతుల దగ్గర్నుంచి భూమి తీసుకునే సమయంలో వారు సంతోషంగా ఉండేలా పరిహారం అందించాలని మంత్రి ఆదేశించారు.
సీడ్ గార్డెనింగ్ ఏర్పాటు చేయడం ద్వారా దేశ రైతాంగానికి ఉపయోగపడుతుందని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి కోరారు. అకాల వర్షాలు, కరువు కాటకాలకు తట్టుకొని నిలబడే పంట ఆయిల్ పామ్ అని అన్నారు. మిర్చి, మొక్క జొన్న, చివరికి వరిలో కూడా అంతర్ పంట కింద సాగు చేసి మొదటి 3 సంవత్సరాలు ఆదాయం సమకూర్చుకోవచ్చని తెలిపారు.
ధాన్యం పంట సాగు వైపు కాకుండా వక్క, జాజి, ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటల వైపు రైతులు దృష్టికి సారించాలని అన్నారు. కష్టాలు లేకుండా తక్కువ ఖర్చుతో మంచి ఆదాయం వచ్చే పంట ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్ పామ్ మాత్రమేనని అన్నారు.
సీడ్ గార్డెనింగ్ కు సంబంధించి ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలం రైతులను ఒప్పించి నెలాఖరు నాటికి సేకరణ చేయాలని అన్నారు. ఫ్యాక్టరీ వద్ద రోడ్లు, సబ్ స్టేషన్ సకాలంలో అందేలా చూడాలని అన్నారు.
*వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ* గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రావడం ద్వారా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీనీ త్వరగా పూర్తి చేసుకొని ప్రారంభించుకునే విధంగా అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని అన్నారు. ఆయిల్ పామ్ సాగు జిల్లాలో క్రమంగా పెరుగుతుందని, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ద్వారా స్థానిక రైతాంగానికి మేలు జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, జిల్లా ఉద్యానవన అధికారి మధుసూదన్, ప్రాజెక్ట్ డిజిఎం., సర్పంచ్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
