ఏప్రిల్ 2 నుండి గ్రామసభలు విస్తృతంగా నిర్వహించాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
సంక్షేమ పథకాల వివరాలతో పాటు జూన్ 2 నుంచి కొత్త పతాకాలపై అవగాహన కల్పించాలి
కొత్తగూడెం : లోకల్ గైడ్ :
ప్రజా పాలన – ప్రజా ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక)లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 2 నుంచి గ్రామసభలను పెద్ద ఎత్తున నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జిల్లా కలెక్టర్లకు సూచించారు. మంగళవారం సాయంత్రం ప్రజాభవన్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, గ్రామసభలు రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గ్రామసభల ప్రారంభంలో ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించి, అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు. రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలను గ్రామసభల్లో చదివి వినిపించాలని తెలిపారు. జూన్ 2 నుంచి అమలు చేయనున్న జీవిత బీమా పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల ప్రచారంలో సాంస్కృతిక శాఖ, పౌర సంబంధాల శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీలకు విడుదలైన నిధుల వివరాలను గ్రామసభల్లో ప్రకటించి పారదర్శకత పాటించాలని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాలు, సేవా రంగ అభివృద్ధిపై కూడా దృష్టి సారిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.
