ఆదివాసీల పట్టా కష్టాలు! ఆరవ రోజుకు చేరిన ఆకలి కేక!

రెవెన్యూ-ఫారెస్ట్ ఫైటింగ్‌లో నలిగిపోతున్న ఆదివాసి బిడ్డలు

ఆదివాసీల పట్టా కష్టాలు! ఆరవ రోజుకు చేరిన ఆకలి కేక!

రామన్నగూడెం భూపోరాటంపై ప్రత్యేక కథనం 

అశ్వారావుపేట, లోకల్ గైడ్ : 

రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులు కాగితాలకే పరిమితమయ్యాయా? పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా ఆదివాసీల తలరాతలు మారవా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ సాక్షిగా గత ఆరు రోజులుగా జరుగుతున్న రామన్నగూడెం ఆదివాసీల నిరవధిక నిరాహార దీక్ష ఈ ప్రశ్నలనే సంధిస్తోంది. తమ స్వంత పట్టా భూముల కోసం దశాబ్దాలుగా అడవి బిడ్డలు చేస్తున్న పోరాటం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఇల్లు, వాకిలి, పశువులను వదిలి, పసిపిల్లలతో సహా రోడ్డెక్కిన ఆదివాసీల ఆర్తనాదం పాలకుల చెవికి ఎందుకు చేరడం లేదన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ సమస్యకు మూలం అశ్వారావుపేట మండలంలోని లంకాలపల్లి అనే రద్దు చేయబడిన రెవెన్యూ గ్రామం. ఒకప్పుడు ఉనికిలో ఉండి, జన సంచారం లేదనే సాకుతో రద్దు చేసిన ఈ గ్రామం పేరు చెప్పి ఫారెస్ట్ అధికారులు రామన్నగూడెం ఆదివాసీల పట్టా భూములను ఆక్రమించుకున్నారనేది ప్రధాన ఆరోపణ. సర్వే చేయకుండానే, హద్దులు నిర్ణయించకుండానే గిరిజనుల సాగు భూములను తమ పరిధిలోకి తెచ్చుకున్న అటవీ శాఖ తీరు వల్ల వందలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. రెవెన్యూ రికార్డుల్లో పట్టా అని ఉన్నా, క్షేత్రస్థాయిలో అటవీ శాఖ కంచె వేయడం అధికారుల మధ్య సమన్వయ లోపానికి పరాకాష్ట. ఎన్నికల హామీలు ఎడారి ఎండమావులు

ఓట్ల సమయంలో వస్తారు, కాళ్ళ వేళ్ళ పడతారు. తీరా గెలిచాక మా మొహం చూసే నాథుడే లేడు అని రామన్నగూడెం గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు మారారు, ప్రభుత్వాలు మారాయి. కానీ ఆదివాసీల భూ సమస్య మాత్రం మ్యాపుల మధ్యే నలుగుతోంది. ప్రజాప్రతినిధుల హామీలు కేవలం ఎన్నికల స్టంట్లుగానే మిగిలిపోయాయని, తమను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారని వారు మండిపడుతున్నారు. పోలీసు లాఠీలు, అధికారుల వేధింపులు, తమ హక్కుల కోసం గొంతెత్తితే ఎదురయ్యేది పోలీసు కేసులు, ఫారెస్ట్ అధికారుల బెదిరింపులేనని గిరిజనులు వాపోతున్నారు. అభివృద్ధికి వందేళ్ల దూరంలో నెట్టబడిన ఈ గ్రామం, నిత్యం గొడవలు, ఆందోళనలతోనే కాలం వెళ్లదీస్తోంది. పచ్చని పంటలు పండించాల్సిన చేతులు, నేడు జిల్లా కార్యాలయం ముందు నిరసన ప్లకార్డులు పట్టుకోవడం వ్యవస్థా లోపానికి నిదర్శనం. నిమ్మకు నీరెత్తినట్లు యంత్రాంగంఉంది. వరుసగా ఆరో రోజు దీక్ష కొనసాగుతున్నా, ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చీమ కుట్టినట్లయినా లేదు అన్న ఆదివాసీల మాట వారిలోని తీవ్ర అసంతృప్తిని తెలియజేస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ఆదివాసీల పట్టా భూములను తక్షణమే వారికి అప్పగించాలని,దశాబ్దాల నిర్లక్ష్యానికి చరమగీతం పాడి, ఆ గ్రామానికి సామాజిక న్యాయం చేయాలని, రామన్నగూడెం ఆదివాసీల ఆత్మగౌరవ పోరాటానికి ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, రాజకీయ పార్టీలు మద్దతు తెలపాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ ఆకలి కేకలు శాంతి భద్రతల సమస్యగా మారకముందే ప్రభుత్వం మేల్కొనాలని ప్రజలు ప్రజాస్వామిక వాదులు హెచ్చరిస్తున్నారు.

Tags:

About The Author

Latest News

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
    ( లోకల్ గైడ్ షాద్ నగర్) ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామ పంచాయతీకి చెందిన రాత్లవాత్ చాంది కు మంజూరైన సీఎం రిలీఫ్
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్‌గా జీ లక్ష్మణ్ కుమార్ నియామకం
కామారెడ్డి ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ
మానవత్వం చాటుకున్న మందమర్రి పోలీసులు....
ఆదివాసీల పట్టా కష్టాలు! ఆరవ రోజుకు చేరిన ఆకలి కేక!
శిల్పారామం లో అలరించినా భరతనాట్య ప్రదర్శనాలు.....
రవీంద్ర భారతిలో తెలుగు నూతన సంవత్సర ఉగాది శ్రీరామనవమి పండగ సెలబ్రేషన్ సందర్భంగా బీరంగూడ