విద్యార్థుల వినతిపై తక్షణమే స్పందించిన కలెక్టర్...
అప్పటికప్పుడు ప్రైవేట్ కళాశాల ద్వారా టీ.సీలు ఇప్పించిన జిల్లా కలెక్టర్...
నిజామాబాద్ జిల్లా (లోకల్ గైడ్); ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ లో చేరిన విద్యార్థులకు బదిలీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రైవేట్ కళాశాల నిరాకరిస్తోందని బాధిత విద్యార్థులు చేసిన ఫిర్యాదుపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తక్షణమే స్పందించారు. అప్పటికప్పుడు కలెక్టర్ తానే స్వయంగా ప్రైవేట్ కాలేజీకి వెళ్లి విద్యార్థులకు టీ.సీలు ఇప్పించారు.
నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించిన సమయంలో కలెక్టర్ వాహనాన్ని గమనించిన బాధిత విద్యార్థులు కలెక్టర్ ను కలిసి తమ ఆవేదనను తెలియజేశారు. కమ్మర్పల్లిలోని శ్రీ భాషిత ప్రైవేట్ జూనియర్ కళాశాలలో గత ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం చదివిన తాము, ఫీజు భారం భరించే స్థోమత లేక ఈ ఏడాది స్థానికంగా గల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సెకండ్ ఇయర్ లో చేరడం జరిగిందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అయితే టీ.సీ కోసం గడిచిన పక్షం రోజుల నుండి ప్రైవేట్ కాలేజీ చుట్టూ తిరుగుతున్నా, తమకు టీ.సీ ఇవ్వడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. తాము అన్ని ఫీజులు చెల్లించామని, అయినా కూడా సుమారు 15 మంది విద్యార్థులకు టీసీ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో టీ.సీ అందించేందుకు ఈ రోజే (బుధవారం) చివరి గడువు అని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ అప్పటికప్పుడు ప్రైవేట్ కళాశాలకు వెళ్ళి నిర్వాహకులను నిలదీశారు. విద్యార్థులకు టీ.సీలు ఇవ్వకుండా పక్షం రోజుల నుండి ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు వారికి నచ్చిన కాలేజీలో చదివే స్వేచ్ఛ ఉందని, సెకండ్ ఇయర్ కూడా ఇక్కడే చదవాలని బలవంతం చేయడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. విద్యార్థులకు ఇప్పటికిప్పుడు టీ.సీలు ఇవ్వాలని, లేనిపక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక తహసీల్దార్ ప్రసాద్ ను, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ను అక్కడికి పిలిపించుకుని విద్యార్థులకు వెంటనే టీ.సీలు ఇప్పించి, ప్రభుత్వ కాలేజీలో ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
దీంతో విద్యార్థులు కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ చూపిన చొరవతో నిమిషాల వ్యవధిలో తమ సమస్య పరిష్కారం అయ్యిందని, ఫీజుల భారం పడకుండా, విద్యా సంవత్సరం నష్టపోకుండా తమను ఆదుకున్నారని హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. విద్యార్థుల వినతిపై కలెక్టర్ సత్వరమే స్పందించి, సమస్యను స్వయంగా దగ్గరుండి పరిష్కరించడం పట్ల స్థానికులు సైతం హర్షం వ్యక్తం చేశారు
About The Author
