గచ్చిబౌలి నేతాజీ నగర్‌లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి వినతి.
బస్తీ బాట’ కార్యక్రమంలో అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన.
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ కాలనీలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై గచ్చిబౌలి విద్యుత్ శాఖ ఏడీఈ ఈ.శివ ప్రసాద్‌కు కాలనీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ వినతిపత్రం అందజేశారు. కాలనీలో జనాభా పెరుగుదలతో పాటు విద్యుత్ వినియోగం అధికమవడంతో వోల్టేజ్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆయన అధికారులకు వివరించారు.
ముఖ్యంగా కాలనీలో కొత్త విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయాలని, కొన్ని వీధులలో ఉన్న సింగిల్ ఫేస్ కరెంట్‌ను త్రీ ఫేస్ కరెంట్‌గా మార్చాలని వినతిపత్రంలో కోరారు. దీనికి స్పందించిన ఏడీఈ ఈ.శివ ప్రసాద్ సానుకూలంగా స్పందిస్తూ, త్వరలోనే కొత్త ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యలను పూర్తిగా నివారిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మూడు గల్లీలలో సింగిల్ ఫేస్ లైన్లను త్రీ ఫేస్ కరెంట్‌గా మారుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నేతాజీనగర్ కాలనీ తరఫున అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్‌తో పాటు ఉపాధ్యక్షులు కే.నరసింహ యాదవ్, ప్రసాద్ యాదవ్, రాఘవేంద్ర శర్మ, మౌలానా, సుభాష్ ముదిరాజ్, మణికంట అసోసియేషన్ సభ్యులు, విద్యుత్ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కొన్ని వీధులలో సింగిల్ ఫేస్ కరెంట్ కారణంగా లో వోల్టేజ్ సమస్యలు ఎదురవుతున్నాయని, అక్కడ త్రీ ఫేస్ కండక్టర్లు లాగాల్సిన అవసరాన్ని అధికారులకు వివరించారు. మంగళవారం నల్లగండ్ల సెక్షన్ పరిధిలోని నేతాజీనగర్ కాలనీలో తెలంగాణ విద్యుత్ శాఖ టిజీఎస్ పిటిసిఎల్, టిజిఎన్ పిడిసిఎల్, చేపట్టిన వినూత్న ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం “బస్తీ బాట” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వోల్టేజ్ సమస్యలు, వదులుగా ఉన్న విద్యుత్ తీగలు, పాత స్థంభాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వినియోగ దారులకు అంతరాయం లేని, నాణ్యమైన విద్యుత్ అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ఏడీఈ ఈ. శివప్రసాద్, సబ్ ఇంజనీర్ కిషోర్, శ్యామ్, ఎస్.వి. రాజు, రమేష్, నరేష్, పద్మారావు, రవీందర్, చరణ్, అశోక్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
