ఉచిత బస్సు ప్రయాణంతో రూ.10,000 కోట్లకు పైగా ఆదా – మహాలక్ష్మి పథకం ఘన విజయం
290 కోట్లకు పైగా మహిళల ప్రయాణాలు – కుటుంబ ఖర్చులు తగ్గించిన మహాలక్ష్మి పథకం ప్రభావం
కొత్తగూడెం : లోకల్ గైడ్ :
ఉచిత మహిళా బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా రూ.10,000 కోట్లకు పైగా ప్రయాణ చార్జీలు ఆదా అయిన సందర్భంగా, 99 రోజుల ప్రజా ప్రగతి ప్రణాళికలో భాగంగా కొత్తగూడెం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్‌లో మహాలక్ష్మి పథకం వేడుకలు మరియు అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంక్షేమాధికారి స్వర్ణలత లెనిన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు జిల్లా కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీమతి విద్యాచందన మాట్లాడుతూ, మహిళల ప్రయాణ ఖర్చులు తగ్గడంతో కుటుంబ ఖర్చుల్లో ఉపశమనం కలుగుతోందని, ఆదా అయిన డబ్బును కుటుంబ అవసరాలకు వినియోగించుకుంటున్నారని తెలిపారు
.
జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగలక్ష్మి మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం మహిళల జీవితాల్లో వెలుగునింపుతూ, వారి స్వాతంత్ర్యానికి కొత్త దారులు తెరిచిందన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరబాబు మాట్లాడుతూ కోట్ల సంఖ్యలో ప్రయాణాలు ఇప్పటికే పూర్తయ్యాయని, ఈ పథకాన్ని మహిళలు ఎంతో ఆనందంగా స్వాగతించారని తెలిపారు.
ఆర్టీసీ కొత్తగూడెం డిపో అదనపు కంట్రోలర్ నాగేశ్వరరావు వివరాలు వెల్లడిస్తూ, 2023 డిసెంబర్ 9న ప్రారంభమైన ఈ పథకం ద్వారా 2026 మార్చి 29 నాటికి మహిళా ప్రయాణికులు మొత్తం 290.27 కోట్ల సార్లు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుని రూ.10,012.15 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు. డిప్యూటీ మేయర్ లలిత మాట్లాడుతూ మహిళల కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి మహిళల పక్షపాతిగా పనిచేస్తున్నారని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ రాజేష్, సీడీపీవో పద్మశ్రీ, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామీణ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉచిత బస్సు సౌకర్యం తమకు ఎంతో ఉపయోగపడుతుందని, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
