అడవి బిడ్డల గొంతుక మూగబోయింది! విప్లవ వీరుడు క్రాంతి కి జన నీరాజనం!

​సొంత గ్రామం తిమ్మంపేటలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు! తరలివచ్చిన వేలాది మంది ప్రజలు, జర్నలిస్టులు, రాజకీయ ప్రముఖులు

అడవి బిడ్డల గొంతుక మూగబోయింది! విప్లవ వీరుడు క్రాంతి కి జన నీరాజనం!

​డప్పు కొట్టి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

అశ్వారావుపేట, లోకల్ గైడ్ : 
విప్లవ పథంలో తుపాకీ పట్టినా జనజీవన స్రవంతిలో కలం పట్టి కథనం రాసినా ఆయన లక్ష్యం ఒక్కటే, అది అట్టడుగు వర్గాల సంక్షేమం. అడవి బిడ్డల కష్టనష్టాలను బాహ్య ప్రపంచానికి చాటిచెప్పిన ఆదివాసీల వారధి, సీనియర్ జర్నలిస్ట్ పోతుగంటి క్రాంతి (45) అంతిమయాత్ర సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగింది. గుండెపోటుతో ఆయన ఆకస్మిక మృతి చెందడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
*​ప్రజా వెల్లువలా అంతిమయాత్ర*
​క్రాంతి భౌతికకాయాన్ని కడసారి వీక్షించేందుకు తిమ్మంపేట గ్రామం జనసముద్రమైంది. విప్లవోద్యమ కాలం నాటి పరిచయాలు, జర్నలిస్టుగా సంపాదించుకున్న మిత్రబృందం, ఆయన సేవా కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన ఆదివాసీ కుటుంబాలు వేలాదిగా తరలివచ్చాయి. జోహార్ క్రాంతి అంటూ మిన్నంటిన నినాదాల మధ్య అంతిమయాత్ర సాగింది.
*​ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు*
​ఈ అంతిమయాత్రలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పాల్గొని క్రాంతికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా డప్పు కొట్టి, నృత్యం చేస్తూ క్రాంతి పోరాట పటిమను స్మరించుకోవడం అందరినీ కదిలించింది. ​రాజకీయ పక్షాలు సిపిఎం నాయకులు, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ మండల కమిటీ నాయకులు నూప భాస్కర్, కొర్సా రామకృష్ణ, కిషోర్, అలాగే న్యూడెమోక్రసీ నాయకులు చంద్రారెడ్డి (సాగర్) బృందం క్రాంతికి జోహార్లు అర్పించారు. దిశ పత్రిక రాష్ట్ర టీం సభ్యులు, ఉమ్మడి జిల్లా జర్నలిస్టులు భారీ సంఖ్యలో హాజరై తమ ప్రియతమ మిత్రుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. ​చిన్నతనం నుంచే కమ్యూనిజం భావజాలంతో పెరిగిన క్రాంతి, తొలుత న్యూడెమోక్రసీలో, అనంతరం మావోయిస్టు పార్టీలో చేరి దండకారణ్యంలో సుదీర్ఘకాలం గెరిల్లా పోరాటం చేశారు. అనంతరం ప్రజాజీవనంలోకి వచ్చి జర్నలిజం వైపు మళ్లారు. ప్రస్తుతం ‘దిశ’ పత్రికలో పనిచేస్తూ ములకలపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, భవన నిర్మాణం కోసం అలుపెరగని పోరాటం చేశారు. ఆదివాసీ జీవన విధానం యూట్యూబ్ ఛానల్ ద్వారా గిరిజనుల ఆచారాలను ప్రపంచానికి పరిచయం చేసిన పరిశోధనాత్మక హృదయం నేడు ఆగిపోయింది. కొండకోనల్లో తిరుగుతూ అడవి బిడ్డల సమస్యలపై ఆయన రాసిన కథనాలు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి. ఆయన మరణంతో ఆదివాసీలు ఒక బలమైన గొంతుకను కోల్పోయారు. క్రాంతి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పలువురు వక్తలు పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News