జిల్లాలో ఇంధన కొరత లేదు – తప్పుడు ప్రచారాలపై పోలీసుల హెచ్చరిక.
జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ స్పష్టం చేశారు.
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)
మార్చి25:సిద్దిపేట జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని తెలిపారు.
సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మి ప్రజలు ఒకేసారి పెట్రోల్ బంకులకు వెళ్లడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటమే కాకుండా సాధారణ సరఫరా ప్రక్రియకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని, సాధారణ అవసరాల మేరకే వినియోగించుకోవాలని సూచించారు.నిర్ధారించని సమాచారాన్ని షేర్ చేయడం ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టించవద్దని హెచ్చరించారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉందని కమిషనర్ తెలిపారు.
