ఏకలవ్య పాఠశాల విద్యార్థులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి
తగు చర్యలకై డిమాండ్!
అశ్వారావుపేట లోకల్ గైడ్ :
దమ్మపేట మండలంలోని గండుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు శనివారం పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై అక్కడ చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల భోజనశాలను, నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు. హాస్టల్ నిర్వహణ తీరుపై అసహనం వ్యక్తం చేసిన తాటి వెంకటేశ్వర్లు, వార్డెన్ మరియు మిడ్ డే మీల్స్ వర్కర్లకు కీలక సూచనలు చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు. వారిని మీ కన్నబిడ్డల్లా భావించి, నాణ్యమైన మరియు ఆరోగ్యకరమైన భోజనం అందించాలని ఆయన పేర్కొన్నారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 పాఠశాలల్లో అస్థవ్యస్థ పరిస్థితులు నెలకొన్నాయని, గత కొన్ని నెలల్లోనే 127 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోనే సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. సంక్షేమ హాస్టళ్లు అద్వానంగా తయారయ్యాయని, విద్యార్థుల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి లెక్క లేకుండా పోతోందని దుయ్యబట్టారు. వందలాది మంది విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని, ఇప్పటికైనా హాస్టళ్లలో వసతులు మెరుగుపరచాలని ఆయన డిమాండ్ చేశారు.
