కన్నీటి సముద్రమైన తిమ్మంపేట! తమ్ముడి పాడె మోసిన మాజీ ఎమ్మెల్యే తాటి!

నా నీడలా ఉండే వ్యక్తి ఇక లేడంటూ కన్నీరుమున్నీరైన తాటి వెంకటేశ్వర్లు

కన్నీటి సముద్రమైన తిమ్మంపేట! తమ్ముడి పాడె మోసిన మాజీ ఎమ్మెల్యే తాటి!

​అంతిమయాత్రలో స్వయంగా డప్పు వాయించిన మాజీ ఎమ్మెల్యే

అశ్వారావుపేట, లోకల్ గైడ్ :
అక్షరం ఆగింది, పోరాటం నిలిచింది. అడవి బిడ్డల గొంతుక శాశ్వతంగా మూగబోయింది! ములకలపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ పోతుగంటి క్రాంతి అంతిమయాత్ర సోమవారం తిమ్మంపేటలో అత్యంత భావోద్వేగ భరితంగా సాగింది. తన నీడలా వెన్నంటి ఉండే వ్యక్తిని కోల్పోయిన ఆవేదనలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు కన్నీరుమున్నీరయ్యారు. ​పాడె మోసి డప్పు కొట్టి ​క్రాంతి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తాటి వెంకటేశ్వర్లు, ఆ కుటుంబ సభ్యులను ఓదారుస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అంతిమయాత్రలో రాజకీయ హోదాను పక్కన పెట్టి, ఒక అన్నగా క్రాంతి పాడెను తన భుజాన మోశారు. అనంతరం అంతిమయాత్ర పొడవునా డప్పు కళాకారులతో కలిసి డప్పు వాయిస్తూ తన ప్రియతమ అనుచరుడికి వీడ్కోలు పలికారు.
*నా కుడి భుజం విరిగిపోయింది*
​ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అత్యంత ఆవేదన చెందారు. క్రాంతికి నాకు మధ్య ఉన్నది కేవలం పరిచయం కాదు, అది ఒక పేగు బంధం. నేను ఎక్కడికి వెళ్లినా నా నీడలా నా వెంటే ఉండేవాడు. నా ప్రతి ప్రజా పోరాటంలో, ప్రతి కార్యక్రమంలో క్రాంతి ఉండాల్సిందే. నా కుడి భుజం లాంటి తమ్ముడిని కోల్పోయాను. ఈ లోటును ఎవరూ పూడ్చలేరు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
*​అడవి బాట నుండి అక్షర పోరాటం వరకు*
​అతిపిన్న వయసులోనే పీడిత ప్రజల కోసం అడవి బాట పట్టి, తుపాకీ పట్టిన క్రాంతి జనజీవన స్రవంతిలోకి వచ్చాక అక్షరాన్ని ఆయుధంగా మలిచారని తాటి కొనియాడారు. ములకలపల్లి ప్రజల గొంతుకగా, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఆదివాసీ జీవన విధానాన్ని ప్రపంచానికి చాటిచెప్పే క్రమంలో ఆయన పడిన తపన అజరామరమని పేర్కొన్నారు.
​తరలివచ్చిన జనవాహిని
​తమ కష్టాల్లో తోడుండే వ్యక్తి ఇక లేడన్న వార్తతో చుట్టుపక్కల గ్రామాల ఆదివాసీలు, అడవి బిడ్డలు వేలాదిగా తరలివచ్చారు. జోహార్ క్రాంతి నీ ఆశయాలు అమరం అంటూ తిమ్మంపేట వీధులు నినాదాలతో మారుమోగాయి. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని క్రాంతికి ఘన నివాళులర్పించారు.

Tags:

About The Author

Latest News