అమెరికాలో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు
ఒక్కచోట చేరి రాఖీ పండగ చేసుకున్న తెలుగువారు
న్యూయార్క్ హిక్స్ విల్లేలో ఉన్న అసమాయ్ హిందూ టెంపుల్ రాఖీ పండగ సంబరాలకు వేదిక అయింది.
నైటా ప్రెసిడెంట్ వాణి ఏనుగు ఆహ్వానం మేరకు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న తెలుగు కుటుంబాలు ఆనందోత్సహాల మధ్య రాఖీ పండగను నిర్వహించారు. తోడబుట్టిన సోదరులకు కొందరు అక్కాచెల్లెళ్లు రాఖీలు కడితే, తాము స్ధిరపడిన అమెరికాలో బాంధవ్యాల రీత్యా సోదరభావం ఏర్పడిన అన్నలు, తమ్ముళ్లకు సోదరీమణులు రాఖీలు కట్టి, వారి నోరు తీపిచేసి, ఆశీర్వాదాలు అందుకున్నారు.
చిన్నపిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారికి నైటా నేతృత్వంలో బహుమతులు అందించారు. అలాగే హాజరైనవారందరికీ నైటా కార్యవర్గం పసందైన విందును కూడా ఏర్పాటుచేసింది. వారాంతం కావటంతో తెలుగు కుటుంబాలన్నీ ఒక్కచోట చేరి రాఖీ వేడుకలకు మరింత శోభను తెచ్చారు.
కార్యక్రమంలో నైటా వైస్ ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, సెక్రటరీ హరిచరణ్ బొబ్బిలి, ట్రెజరర్ నరోత్తమ్ రెడ్డి బీసం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అడ్వయిజరీ కమిటీ, ట్రస్టీలు, ఈవెంట్ స్పాన్సర్లు పాల్గొన్నారు.
About The Author
