భద్రాచలంలో ఘనంగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు
సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆశయాలు ప్రతి గిరిజన బిడ్డ ఆచరించాలి - ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు
భద్రాచలం : లోకల్ గైడ్ :
ఎందరో మహానీయులు పుట్టిన గడ్డ మన భారతదేశమని, అందులో కారణ జన్ముడు, బంజారా జాతి ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జాతిని ఒకే తాటిపై నడిపించిన మహనీయుడని భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్ రావు అన్నారు. సేవాలాల్ మహారాజ్ అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి గిరిజన బిడ్డ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
శుక్రవారం భద్రాచలం పట్టణంలోని గిరిజన భవనంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీ, భద్రాచలం నియోజకవర్గ ఆధ్వర్యంలో భోగ్ బండారో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐటీడీఏ పీవో బీ రాహుల్ ముఖ్య అతిథిగా హాజరై బంజారా కమిటీ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులకు కమిటీ సభ్యులు బంజారా సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి భోగ్ బండారో, వింతీ కార్యక్రమాలు బంజారా సోదరుల సమక్షంలో నిర్వహించారు. అనంతరం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ జాతి ఐక్యత కోసం అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. లంబాడీలు దేవుడిగా భావించి సంత్ సేవాలాల్‌ను ఆరాధిస్తారని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ జంతుబలికి తీవ్రంగా వ్యతిరేకి అని, తల్లిదండ్రులను, మహిళలను గౌరవించాలని ప్రజలకు బోధించారని అన్నారు. ప్రకృతిని, వన్యప్రాణులను పరిరక్షించడం ద్వారా మానవ జన్మ సార్థకమవుతుందని ఆయన సూచించారని తెలిపారు. సంఘ సంస్కర్తగా, ప్రకృతి ప్రేమికుడిగా, ఆధ్యాత్మిక గురువుగా, బంజారాల సంస్కృతి సంప్రదాయాల పరిరక్షకుడిగా, జాతి ఉద్ధారకుడిగా సేవాలాల్ మహారాజ్ నిలిచారని పేర్కొన్నారు. భారతదేశంలో దాదాపు 10 కోట్లకు పైగా జనాభా కలిగిన బంజారా సమాజం ప్రతి సంవత్సరం సేవాలాల్ జయంతిని ఘనంగా జరుపుకుంటుందని తెలిపారు. అనంతరం ఐటీడీఏ పీవో బీ రాహుల్ మాట్లాడుతూ చత్రపతి శివాజీ, గురు నానక్, గౌతమ బుద్ధుల వంటి మహనీయులు ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచేందుకు చేసిన సేవల మాదిరిగానే, లంబాడి బంజారా తెగల అభివృద్ధి కోసం సంత్ సేవాలాల్ మహారాజ్ చేసిన కృషి అపారమని అన్నారు. కర్ణాటక నుండి ఉత్తరప్రదేశ్ వరకు, రాజస్థాన్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరకు ఉన్న బంజారా జాతి అభివృద్ధి కోసం ఆయన కృషి చేశారని తెలిపారు. దేశంలోని గోరు బంజారాలకు స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు సేవాలాల్ మహారాజ్ అని పేర్కొన్నారు. సంచార జీవితం నుంచి బంజారా తెగలను తండా జీవన విధానం వైపు మళ్లించారని తెలిపారు. మద్యం, మాంసాహారాన్ని మాన్పించేందుకు ప్రయత్నించారని, బంజారా సమాజ అభివృద్ధి కోసం దేశమంతటా సంచారం చేసి ప్రజలకు హితబోధ చేశారని అన్నారు. బ్రిటిష్ కాలంలో కూడా మత మార్పిడులను వ్యతిరేకించిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని తెలిపారు. ఆయన 18వ శతాబ్దానికి చెందిన గొప్ప ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్తగా నిలిచారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 15, 1739న అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని సేవాగడ్ (రామచంద్రపురం) గ్రామంలో జన్మించిన ఆయన అహింస, శాంతి, మానవత్వం వంటి విలువలను ప్రజలకు బోధించారని చెప్పారు. ముఖ్యంగా మూఢనమ్మకాలను విడనాడాలని, పర్యావరణాన్ని ప్రేమించాలని, మహిళలను గౌరవించాలని ప్రజలకు ఉపదేశించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం జడ్జి శివ నాయక్, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అశోక్, భద్రాచలం తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, పీవీటీజీ అధికారి గన్యా, బంజారా సంఘం నాయకులు భూక్యా రంగా, లకావత్ వెంకటేశ్వర్లు, బన్సీలాల్, మోహన్ లాల్, గోవింద్, భూక్యా రంజిత్, రాందాస్, భూక్య సాయి కౌశిక్, నాగులు, వంకుదోత్ కృష్ణ, బిక్ష, సైదులు, శీతల నాయక్, మోహన్ నాయక్, కోటి, జుంకీలాల్, సీతయ్య నాయక్, మదన్ నాయక్, మదర్, బంసీలాల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బంజారా సోదరులు, సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
