రంగారెడ్డి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
రంగారెడ్డి జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కె.రామరావు, కార్యదర్శి శ్రీనేష్ కుమార్ నోరి ఆధ్వర్యంలో మంగళవారం ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈ హెచ్ ఎస్ - ఎంప్లాయిస్ హెల్త్ స్కీం)పై సమగ్ర పునఃసమీక్ష చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి, ఇతర సభ్యుల నుంచి అందిన సూచనలు, ప్రతిపాదనల ఆధారంగా రూపొందించిన ఈ వినతిపత్రాన్ని టీజిఒ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్ కలిసి అందజేశారు. రాబోయే రోజులలో ప్రభుత్వంతో జరగనున్న చర్చల సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఈహెచ్ ఎస్ అమలులో ఉన్న లోపాలు, ఆసుపత్రుల ఎంపిక, క్యాష్‌లెస్ చికిత్స సౌకర్యాల వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఉద్యోగులకు అనుకూలంగా మార్పులు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈహెచ్ ఎస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.