అశ్వారావుపేట, లోకల్ గైడ్ :
అశ్వారావుపేట మున్సిపాలిటీ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. మేజర్ గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్రను కొనసాగించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవులను జూపల్లి దంపతులు కైవసం చేసుకోవడం విశేషం. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం సోమవారం జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా సాగింది. చైర్‌పర్సన్‌గా జూపల్లి శశికళ, వైస్ చైర్మన్‌గా జూపల్లి రమేష్ వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికై, పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఒకే కుటుంబానికి రెండు ప్రధాన పదవులు దక్కడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. జై జూపల్లి జై కాంగ్రెస్ నినాదాలతో మున్సిపల్ ప్రాంగణం మారు మోగిపోయింది. అశ్వారావుపేట మున్సిపాలిటీలోని మొత్తం 22 డివిజన్లకు గాను, కాంగ్రెస్ పార్టీ ఏకంగా 17 స్థానాలను గెలుచుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ విజయంలో కాంగ్రెస్ ప్రధాన నాయకుడు జూపల్లి రమేష్ కీలక పాత్ర పోషించారు. గెలిచిన కౌన్సిలర్ల వివరాలు ఇలా ఉన్నాయి కాంగ్రెస్ 17 మంది, బిఆర్ఎస్ 2, బిజెపి ఒక్కరు, స్వతంత్రులు 2 మొత్తం 22 మంది కౌన్సిలర్లువైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సబ్ కలెక్టర్ జె. కార్తీక్ సీతారామ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి సమక్షంలో నూతన కౌన్సిలర్లు, చైర్‌పర్సన్ మరియు వైస్ చైర్మన్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరై నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను అభినందించారు. అశ్వారావుపేట మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని, ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి పథంలో నడిపిస్తామని చైర్ పర్సన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ లు ప్రజలకు హామీ ఇచ్చారు.ప్రమాణ స్వీకారం అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు సిపిఎం, బిఆర్ఎస్, బిజెపి నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. మున్సిపాలిటీగా మారిన తర్వాత జరుగుతున్న తొలి పాలన కావడంతో పట్టణ అభివృద్ధిపై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.