శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ సీతారాముల దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఏసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పిఏసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ..మహా శివరాత్రి అత్యంత పవిత్రమైన పర్వదినమని, శివుడికి ప్రీతికరమైన రోజు అని పేర్కొన్నారు. శివరాత్రి నాడు భక్తులు ఉపవాస దీక్షలు, జాగరణలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పరమశివుడిని ఆరాధిస్తారని తెలిపారు. శివతత్వం మనిషికి దీక్ష, తపస్సు, స్థైర్యం వంటి మహత్తర గుణాలను బోధిస్తుందని చెప్పారు. శివ శబ్దం మంగళప్రదమని, అనేక శుభ గుణాలకు నిలయుడైన శివుడిని లోకమంతా ఆరాధిస్తుందని, శివనామ స్మరణతో మనసుకు శాంతి చేకూరుతుందని వివరించారు. మహా శివరాత్రి సందర్భంగా ప్రజలందరిపై మహాదేవుని కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ, సమస్త భక్త జనకోటికి మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.