ఆంధ్రప్రదేశ్ నుంచి ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు — రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు, 24 గంటల నిఘా
( ఖమ్మం: లోకల్ గైడ్)
ఖమ్మం, ఫిబ్రవరి 16: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ రవాణాను నియంత్రించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని టెలీకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో సూచించారు.
సరిహద్దు పోలీస్ స్టేషన్లు అప్రమత్తంగా ఉండాలని, అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను వెంటనే సీజ్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రవాణాకు అవకాశం ఉన్న అన్ని మార్గాల్లో చెక్‌పోస్టుల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని పేర్కొన్నారు. అక్రమంగా ఇసుక నిల్వ చేసినా, రవాణా చేసినా కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు.
ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌పోస్టుల్లో పోలీస్ సిబ్బంది మూడు షిఫ్టుల విధానంలో 24 గంటలు విధులు నిర్వహిస్తూ నిఘాను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.
స్థానిక వినియోగం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర మైనింగ్ నిబంధనలు అనుసరించిన అధికారిక ఇసుకను మాత్రమే వినియోగించాలని కాంట్రాక్టర్లు, స్థానికులకు సూచించారు.
