భవిత కేంద్రం, విద్యా సంస్ధల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల నైపుణ్యాలు పెంపొందించేందుకు ఆధునిక పరికరాలు, వసతుల ఏర్పాట్లు
విద్యార్దులలో ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం పెరిగేలా పకడ్బందీగా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అమలు .1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు రీడింగ్ స్కిల్స్ పెంపుపై ప్రతిరోజు గంట సమయం తరగతులు
కొణిజర్ల మండలంలోని భవిత కేంద్రం, చిన్న మునగాల లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నందు ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఖమ్మం, మార్చి - 16:లోకల్ గైడ్ :
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు (దివ్యాంగులైన) అన్ని రకాలుగా శిక్షణ, సహకారం అందించి సాధారణ పిల్లలకు సమానంగా తీర్చిదిద్దడమే భవిత కేంద్రం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
అనంతరం కొణిజర్ల మండలం చిన్న మునగాల ప్రాథమిక పాఠశాలలో నిర్వహించే ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలును జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండు, మూడవ తరగతి గదులలో విద్యార్థులు ఇంగ్లీషు అక్షరాలు, పదాల ఉచ్చారణను కలెక్టర్ చదివించారు. అదే ప్రాగణంలో ఉన్న ఆంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు, గర్బిణి మహిళలకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం, కోడిగుడ్లు అందించాలని సిబ్బందికి సూచించి, రికార్డు పుస్తకాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* భవిత కేంద్రాల్లో ప్రత్యేక విద్యా విధానం ద్వారా దివ్యాంగులైన పిల్లలు మానసికంగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. చిన్న వయసులోనే ఈ కేంద్రాల్లో చేర్పించడం ద్వారా తల్లిదండ్రుల అవసరం లేకుండా వారి పనులు వారే చేసుకునే స్థాయికి చేరుకుంటారని కలెక్టర్ వివరించారు.
జిల్లాలో ప్రభుత్వ అంధుల, బధిరుల పాఠశాల, భవిత కేంద్రాల్లోని దివ్యాంగులైన పిల్లల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తున్నామని, కావాలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల నైపుణ్యాలు పెంపొందించేందుకు ఆధునిక యంత్రాలు, వసతులతో వివిధ వైకల్యం కలిగిన శారీరకంగా బలహీనమైన వారికి ఫిజియోథెరపీ, మాటలు రాని వారికి స్పీచ్ థెరపి ఇప్పించడం, వినికిడి సక్రమంగా లేని పిల్లలకు వినికిడి పరికరాలు, ప్రత్యేకమైన బోధన ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
భవిత సెంటర్ లలో ప్రతిపాదించిన అభివృద్ధి పురోగతి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, దివ్యాంగ విద్యార్థులకు అనుకూలంగా భవిత సెంటర్లను తీర్చిదిద్దాలని తెలిపారు. అధికారులు అంగన్వాడీ, భవిత సెంటర్ ప్రభుత్వ అభివృద్ధి పనులు, భవనాలు, పాఠశాలల్లో కిచెన్ షెడ్, శౌచాలయాల నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించాలని అన్నారు.
అదే విధంగా నిర్మాణంలో ఉన్న భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసే విధంగా గుత్తేదారులకు సూచనలు ఇవ్వాలని తెలిపారు. శిధిలావస్థ లో ఉన్న అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల భవనాలను గుర్తించి వాటి స్థానంలో నూతనంగా మంజూరైన భవనాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఏ విషయంలో సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని, పాఠశాల ఆదనపు తరగతి గదులు నిర్మాణాల ఏర్పాటులో జాప్యం చేయకూడదని ఇదివరకే అనుమతులు ఇచ్చిన నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలోని ప్రతి విద్యార్థికి చదివే సామర్థ్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. విద్యా ప్రమాణాల పెంపుదలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు లభిస్తుందన్నారు. విద్యార్థులకు ముందుగా చదవడం, చదివింది అర్థం చేసుకోవడం అనే నైపుణ్యాలు రావడం చాలా కీలకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఎంఓ ప్రవీణ్ కుమార్, విద్యా శాఖ ఇఇ బుగ్గయ్య, కొణిజర్ల మండల విద్యాధికారి అబ్రహం, హెడ్ మాస్టర్ నాగమల్లేశ్వర రావు, ఏఈ సురేష్, సర్పంచ్ పూనాటి బాబురావు, ఉపాధ్యాయులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
