సిద్దిపేట జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్ తెలంగాణ)
మార్చి26:ప్రజల భద్రత మరియు నేర నియంత్రణను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో సిద్దిపేట పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ రెండో విడత నేడు ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో భాగంగా కమిషనరేట్ పరిధిలోని 12 పోలీస్ స్టేషన్లలో మొత్తం 152 నూతన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఇప్పటికే మొదటి విడతలో మార్చి 2న 200కి పైగా కెమెరాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 26 సీసీ కెమెరాలను కమిషనర్ రష్మీ పెరుమాళ్ స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీసీ కెమెరాలు శాంతిభద్రతల పరిరక్షణలో “మూడో కన్ను”గా పనిచేస్తాయని, నేరస్తులను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.అలాగే చిన్నకోడూరు మండలం చంద్లపూర్ గ్రామంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్ 10 సీసీ కెమెరాలను ప్రారంభించగా, సిరిసినగండ్ల గ్రామంలో అదనపు డీసీపీ ఏఆర్ సుభాష్ చంద్రబోస్ 23 కెమెరాలను ప్రారంభించారు. మిగిలిన తొమ్మిది పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆయా అధికారులు కెమెరాలను ఏకకాలంలో ప్రారంభించారు.ఈ ‘సురక్ష నేత్ర’ కార్యక్రమం ద్వారా కాలనీలు, ప్రధాన కూడళ్లు మరియు గ్రామాల్లో నిరంతర నిఘా కొనసాగనుంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని కమిషనర్ రష్మీ పెరుమాళ్ పిలుపునిచ్చారు.