గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం ఆలయ తొలి దశ అభివృద్ధి పూర్తి : మంత్రి కొండా సురేఖ
అంగరంగ వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం
భద్రాచలం : లోకల్ గైడ్ :
గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం తొలి దశ అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.
శుక్రవారం భద్రాచలంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ, భద్రాచలంలోని శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి విశేష ప్రాముఖ్యత ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఈ మహోత్సవాన్ని వీక్షిస్తారని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడవ సంవత్సరం మంత్రిగా ఈ వేడుకల్లో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని, డిప్యూటీ సీఎం మరియు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అవసరమైన భూసేకరణ పూర్తి చేసినట్లు తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని తొలి విడతగా రూ.351 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. గోదావరి పుష్కరాల సమయానికి ప్రస్తుత అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు దేవాదాయ శాఖ కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం రెండో విడత నిధులను విడుదల చేసి, కృష్ణ పుష్కరాల నాటికి పూర్తి స్థాయి అభివృద్ధి పనులు పూర్తిచేస్తామని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులందరికీ శ్రీ రామచంద్ర స్వామి ఆశీస్సులు కలగాలని, ప్రజా ప్రభుత్వానికి శక్తి ప్రసాదించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు దీవించాలని మంత్రి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
