ప్రజల మన్ననలు పొందేలా ప్రజా ప్రతినిధులు పని చేయాలి....
రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
ఖమ్మం: లోకల్ గైడ్
శిక్షణ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలి
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి, జిల్లా కలెక్టర్
ఖమ్మం,
ఫలానా నాయకుని హయంలో మా ప్రాంతం బాగా అభివృద్ధి
చెందిందని ప్రజల మన్ననలు పొందేలా ప్రజా ప్రతినిధులు పని చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గురువారం ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో
నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు, మునిసిపల్ చైర్ పర్సన్, వార్డు కౌన్సిలర్ లు, ఇతర ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూమార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి, రాష్ట్ర కేబినెట్ ఆలోచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని, ప్రజల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గురించి అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన లబ్ధిదారు లకు అవి చేరేలా చూడాలని తెలిపారు.
డబ్బు సంపాదించడం కోసం ప్రజా ప్రతినిధులు ఎవరు రాజకీయంలోకి రాలేదని అన్నారు. సర్పంచ్ నుంచి కలెక్టర్ వరకు ప్రజలకు సేవ చేసే అవకాశం భగవంతుడు మనకు అందించారని, మనం అధికారంలో ఉన్న సమయంలో గ్రామంలో మంచి అభివృద్ధి జరిగింది, మంచి పనులు జరిగాయనే మంచి పేరు సంపాదించాలని తాపత్రయ పడతామని మంత్రి అన్నారు.
ఓట్లు వేసిన ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత మనపై నేడు ఉందని అన్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కొంత సమయం కేటాయిస్తే క్షేత్రస్థాయిలో మంచి మార్పు కనిపిస్తుందని అన్నారు. పాలక వర్గాలు లేక గ్రామాలకు నిధులు రాలేదని, గత నెలన్నర కాలంలో పెద్ద ఎత్తున నిధులు విడుదల అయ్యాయని, మార్చి 31 లోపు మరిన్ని నిధులు విడుదల అవుతాయని మంత్రి తెలిపారు.
ప్రతి గ్రామానికి జనాభా ఆధారంగా 5 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు నిధులు విడుదల అయ్యాయని, ఈ నిధులు ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని అన్నారు. చట్ట పరిధిలో నిధులను సద్వినియోగం చేయాలని, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా కాపలాదారుగా ఉండాలని తెలిపారు.
పేద ప్రజలకు నిరంతరం మంచి చేసే విధంగా, రాజకీయాలకతీతంగా ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని, ప్రస్తుతం గెలిచిన ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పని చేయాలని కోరారు. ప్రతి ప్రాంత అభివృద్ధికి పార్టీలకతీతంగా తన సహకారం ఉంటుందని ఆయన తెలిపారు.
రాబోయే వేసవిలో త్రాగునీటి సమస్య ఏ గ్రామంలో లేకుండా ఉండే విధంగా అధికారులు, నూతన ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. గ్రామ పంచాయతీకి విడుదలైన నిధులు సద్వినియోగం అయ్యే విధంగా ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు తెలిపారు.
గ్రామాలలో సమస్యలు కేవలం డబ్బుతో మాత్రమే పరిష్కారం కావని అన్నారు. సిసి రోడ్ల, డ్రైయిన్ నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టడం చాలా కీలకమని అన్నారు. గ్రామాలలో నిర్మించే నూతన రోడ్లు, డ్రైయిన్ సమయంలో అధికారులు ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ అధికంగా ఉండాలని, ఎక్కడ కూడా మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని అన్నారు.
ప్రజలతో నిరంతరం ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉంటూ సమయస్ఫూర్తితో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని అన్నారు. నేటి శిక్షణ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు సరిగ్గా వినియోగించు కోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం విజయవంతం చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయడం కీలకమని తెలిపారు. 99 రోజుల కార్యక్రమం పై స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేడు ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజా ప్రతినిధులకు గుర్తింపు కార్డులు, 99 రోజుల కార్యక్రమంపై మెటీరియల్ అందించామని అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల పాటు 10 థీమ్స్ లో చేపట్టే ప్రోగ్రాంలలో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం, ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన వివిధ సంక్షేమ, అభివృద్ధి పనుల అమలు గురించి అవగాహన, పంచాయతీ, మున్సిపల్ చట్టాల గురించి కూడా శిక్షణ అందిస్తామని కలెక్టర్ తెలిపారు.
నేటి శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అన్నారు. ఇంటారాక్టివ్ సెషన్ లాగా నేటి శిక్షణ కార్యక్రమం ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ* నూతనంగా ఎన్నికైన సర్పంచ్, పట్టణ ప్రాంత ప్రజా ప్రతినిధులకు విధి నిర్వహణ, ప్రభుత్వ ముఖ్యమైన కార్యక్రమాలు ప్రజలకు అందించేందుకు ఉన్న నిబంధనలు విధివిధానాల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో 99 రోజుల కార్యాచరణ చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి తమ గ్రామం, మున్సిపల్ వార్డు/డివిజన్ పరిధిలో నిబంధనల ప్రకారం బాగా పనిచేసి జాతీయస్థాయిలో ఆదర్శ వంతంగా తీర్చిదిద్దాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, పంచాయతీ రాజ్ డిప్యూటీ కమీషనర్, జిల్లా ప్రత్యేక అధికారిణి విద్యాలత, జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, డిపిఓ రాంబాబు, డిఆర్డిఓ కె. శ్రీరామ్, సిపిఓ ఏ. శ్రీనివాస్, డివైఎస్ఓ సునీల్ రెడ్డి, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రామారావు, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. విజయలక్ష్మీ, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు నాయక్, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులు, సర్పంచులు, మునిసిపల్ చైర్ పర్సన్లు, వార్డు కౌన్సిలర్ లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
