శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
సమాజంలో పెరుగుతున్న కుటుంబ విభేదాల నేపథ్యంలో కొందరు పిల్లలు తల్లిదండ్రుల నుండి ఆస్తులు పొందిన తర్వాత వారిని నిర్లక్ష్యం చేస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో వృద్ధులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మెయింటెనెన్స్, వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్, సీనియర్ సిటిజెన్ యాక్ట్ 2007 ప్రకారం తల్లిదండ్రులు, వయోవృద్ధులకు చట్టపరమైన రక్షణ కల్పించబడింది. ఈ చట్టం ప్రకారం మీ హక్కులు: ఆస్తి వాపసు (సెక్షన్ 23): పిల్లలు లేదా వారసులు చూసుకుంటా మని చెప్పి గిఫ్ట్ డీడ్ లేదా సెటిల్‌మెంట్ ద్వారా ఆస్తి రాయించుకుని, తరువాత పోషణ చేయకపోతే, ఆ ఆస్తి బదిలీని రద్దు చేయించుకునే హక్కు వృద్ధులకు ఉంది. ట్రిబ్యునల్ ద్వారా ఆస్తిని తిరిగి తమ పేరుపైకి మార్చించు కోవచ్చు. నెలవారీ భరణం (మెయింటెనెన్స్) ఆస్తి ఉన్నా లేకపోయినా, తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదే. వారి నుండి ప్రతినెలా భరణం పొందే హక్కు చట్టం కల్పిస్తుంది. ఎవరిని సంప్రదించాలి సంబంధిత రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డిఓ) కార్యాలయం లో ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు. ఈ ప్రక్రియకు లాయర్ అవసరం లేదు. సాధారణంగా 90 రోజులలో సమస్య పరిష్కారం చేయాలని చట్టంలో పేర్కొనబడింది. సహాయం కోసం: సీనియర్ సిటిజన్ హెల్ప్‌లైన్ నంబర్: 14567 (ఉచిత సేవ), వృద్ధులు తమ హక్కుల గురించి అవగాహన పెంచుకుని, చట్టపరమైన రక్షణ పొందాలని అధికారులు సూచిస్తున్నారు. కుటుంబ విలువలను కాపాడటం సమాజం మొత్తం బాధ్యత అని వారు పేర్కొన్నారు.