ఎమ్మెల్యే గారు అటెన్షన్ ప్లీజ్ !
కావడిగుండ్ల బస్సు - మూణ్ణాళ్ల ముచ్చటేనా? సెలవు వస్తే ఆర్టీసీకి కూడా సెలవేనా?
ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి - ప్రయాణికులను గాలికొదిలేశారు! అశ్వారావుపేట ఏజెన్సీ పల్లెల్లో రవాణా రోదన!
అశ్వారావుపేట, లోకల్ గైడ్ :
అశ్వారావుపేట నుంచి ఊట్లపల్లి, వేదాంతపురం, రామన్నగూడెం, రాజన్నగూడెం, పూచికపాడు, కన్నాయిగూడెం మీదుగా కావడిగుండ్ల వరకు సాగే ఈ బస్సు ప్రయాణం వేలాది మంది గిరిజన బిడ్డలకు జీవనరేఖ వంటిది. బస్సు ప్రారంభమైన కొత్తలో ప్రజలు పాలాభిషేకాలు చేసి హర్షం వ్యక్తం చేశారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ప్రస్తుతం బస్సు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రద్దవుతుందో తెలియక ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్‌లలో పడిగాపులు కాస్తున్నారు.
*పండుగ వస్తే బస్సు క్యాన్సిల్!*
సాధారణంగా పండుగలు, సెలవు దినాల్లో ప్రజల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు నడపాల్సింది పోయి, ఉన్న ఒక్క సర్వీసును కూడా రద్దు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం వచ్చినా, శ్రీరామనవమి వంటి పండుగలు వచ్చినా కావడిగుండ్ల బస్సుకు సెలవు ప్రకటిస్తున్నారు. దీనిపై ఆర్టీసీ అధికారులను ప్రశ్నిస్తే, పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఈ రోజు బస్సు క్యాన్సిల్ అంటూ చల్లగా సమాధానం చెబుతుండటం గమనార్హం. గత వారంలో ఏకంగా నాలుగు రోజులు సర్వీసు నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మహాలక్ష్మి పథకం ఉన్నా మౌలిక వసతులు సున్నా!
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం (మహాలక్ష్మి పథకం) అమలులో ఉన్నప్పటికీ, అసలు బస్సే రాని గ్రామాల్లో ఆ పథకం ఎవరికి ఉపయోగం? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గాండ్లగూడెం - చెన్నాపురం తారు రోడ్డు కలగానే మిగిలిపోయింది. జిల్లా కేంద్రానికి వెళ్లడానికి కనీసం అశ్వారావుపేట నుండి వినాయకపురం మీదుగా పాల్వంచకు నేరుగా బస్సు సౌకర్యం లేదు. నియోజకవర్గంలోని పండువారిగూడెం, అనంతారం, బచ్చువారిగూడెం, గుమ్మడవల్లి వంటి అనేక గ్రామాలకు ఇప్పటికీ బస్సు మొఖం చూడని పరిస్థితి ఉంది.
పాలకుల చిత్తశుద్ధి ఎక్కడ?
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పాలకులు విస్మరించారని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఏజెన్సీ రోడ్ల పరిస్థితి మారలేదని విమర్శలు వస్తున్నాయి. కేవలం ఓట్ల కోసమే పథకాలు తప్ప, ప్రజల కష్టాలను తీర్చే చిత్తశుద్ధి అధికారుల్లో గానీ, పాలకుల్లో గానీ కరువైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అశ్వారావుపేట - కావడిగుండ్ల బస్సు సర్వీసును నిరంతరాయంగా, క్రమం తప్పకుండా నడపాలని, అలాగే మండలంలోని మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని, ఇప్పటికైనా నిద్రాణంలో ఉన్న అధికార యంత్రాంగం మేల్కోకపోతే ఆందోళనలు తప్పవని ఏజెన్సీ ప్రజలు హెచ్చరిస్తున్నారు.
