లేబర్ కోడ్స్, జాతీయ విత్తన, విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలి.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున .
గత 11 సంవత్సరాలుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తూ, కార్మికులకు వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున తీవ్రంగా విమర్శించారు.కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్స్, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలు, జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో కంచనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్‌గా మార్చడం ద్వారా కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించిందని విమర్శించారు.స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాలు దాటినా కూడా కార్మికులు కనీస వేతనానికి నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. కనీస వేతన చట్టాన్ని కఠినంగా అమలు చేసి, నెలకు రూ.26,000 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.వామపక్షాల పోరాట ఫలితంగా 2005లో వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వల్ల గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికుల జీవనంలో మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా జాతీయ విత్తన బిల్లును తీసుకువచ్చి విత్తన రంగాన్ని బహుళజాతి కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. విద్యుత్ సవరణ చట్టం ద్వారా స్మార్ట్ మీటర్లు అమలు చేసి ముందస్తుగా బిల్లులు వసూలు చేయడం, ఉచిత విద్యుత్‌ను భవిష్యత్తులో నిలిపివేసే పరిస్థితులు తీసుకురావడం జరుగుతోందని విమర్శించారు. విద్యుత్ బిల్లులను పెంచి కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించడం, బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ రంగాలను బహుళజాతి కంపెనీలకు అప్పగించడం అన్యాయమని తెలిపారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం సిపిఎం నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ, సీఐటీయూ మండల నాయకులు ఇరిగి దున్న అనిల్, సింగపంగా లింగమ్మ, ఏనుగు వాణి, బుల్లోజు భారతమ్మ, సింగపంగా కిరణ్, గాదె యాదయ్య, సోమనబోయిన శ్రీను, యాదయ్య, నర్సిరెడ్డి, ధనంజయ, సుధాకర్, మల్లేష్, శంకర్, సమీనా, సువర్ణ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
