విస్తృత స్థాయిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి
మంత్రి లక్ష్మణ్ కుమార్ తో కలిసి కలెక్టర్లతో వీ.సీ ద్వారా సమీక్ష జరిపిన డిప్యూటీ సీఎం
నిజామాబాద్, లోకల్ గైడ్ :
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ భవనం నుంచి మొదలుకుని రాష్ట్ర సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల భవనాల పై సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ విధానపరమైన నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. శనివారం ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, ఎస్.పీ.డీ.సీ.ఎల్ సీఎండి ముషారఫ్, రెడ్కో సీఎండీ అనిలా తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం అమలు, ఇరిగేషన్, దేవాదాయ తదితర శాఖల పరిధిలోని ఖాళీ భూములలో, అవకాశం ఉన్న అన్ని చోట్ల సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని జిల్లాల సమీకృత కార్యాలయాల భవనాలపై, పార్కింగ్, క్యాంటీన్ ల వద్ద సోలార్ యూనిట్ల ఏర్పాటు కోసం ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు అన్నీ కూడా ఒకే నమూనాలో నిర్మించినందున సోలార్ పవర్ ప్లాంట్ ల ఏర్పాటుకు అనుకూలమైన డిజైన్లను హైదరాబాదు నుంచి ఎంపిక చేసి పంపిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇప్పటికే కలెక్టర్ కార్యాలయాల్లో సోలార్ యూనిట్లకు సంబంధించిన మంచి డిజైన్లు ఉంటే, వాటిని పంపాలని సూచించారు. అన్ని కార్యాలయాల్లో సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన వివరాలకు సంబంధించి కలెక్టర్లు హైదరాబాద్ కు పంపాల్సిన వివరాలకు సంబంధించి నిర్ణీత ఫార్మాట్ పంపిస్తున్నామని అన్నారు . అందులో అన్ని వివరాలు నమోదు చేసి వారం రోజుల్లోపు విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కార్యాలయానికి పంపాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
ప్రభుత్వ భవనాలతో పాటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, విశ్వ విద్యాలయాలు వంటి ఉన్నత విద్యా సంస్థల భవనాలపై కూడా సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధించిన భవనాల వివరాలు పంపాలని కలెక్టర్లకు సూచించారు.
నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ పరిధిలో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు ఉన్నాయని, వాటి వివరాలు సైతం పంపాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద 6.70 లక్షల ఎకరాల భూములను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిందని చెప్పారు . ఈ భూముల్లో నల్లమల డిక్లరేషన్ కింద ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ద్వారా ఉచితంగా సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం కలెక్టర్లకు వివరించారు. నల్లమల డిక్లరేషన్ లో భాగంగా ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలో ప్రారంభించామని తెలిపారు . ఈ నెలలోనే ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని జాప్యానికి తావు లేకుండా వారం రోజుల్లోపు వివరాలు పంపాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో నిజామాబాదు నుండి జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, టీజీ రెడ్కో డీ.ఎం రమణ, ట్రాన్స్కో ఎస్.ఈ రవీందర్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
