పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదు – ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్
నారాయణపేట ఏప్రిల్ 9:
ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు తెలంగాణ పోలీసులు “ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు” విధానాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ విధానం ద్వారా బాధితులు పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా, ఫోన్ ద్వారా సమాచారం అందించిన వెంటనే పోలీసులు బాధితుల నివాసానికి లేదా వారికి అనుకూలమైన ప్రదేశానికి వెళ్లి ఫిర్యాదును స్వీకరిస్తారు. ఫిర్యాదు రాయలేని పరిస్థితుల్లో పోలీసులే బాధితుడి వాంగ్మూలాన్ని వారి భాషలో నమోదు చేసి, చదివి వినిపించి సంతకం తీసుకొని అక్కడికక్కడే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ప్రతిని అందజేస్తారు.
ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు మరియు బలహీన వర్గాల వారికి ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. లైంగిక నేరాలు, హత్యాయత్నం, గాయపరిచే ఘటనలు, దొంగతనం, దోపిడీ, చోరీ వంటి ఆస్తి సంబంధిత నేరాలు, పోక్సో కేసులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాల్య వివాహ నిరోధక చట్టాలకు సంబంధించిన కేసుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.మహిళలు, పిల్లల కేసుల్లో మహిళా పోలీసు అధికారిని తప్పనిసరిగా పంపిస్తారు. అవసరమైతే ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయుల సమక్షంలో వాంగ్మూలం నమోదు చేస్తారు. పోలీసులు సంఘటన స్థలాన్ని రక్షించి, సాక్ష్యాలను సేకరించే చర్యలు వెంటనే ప్రారంభిస్తారు.
ఈ విధానం వల్ల ఫిర్యాదు నమోదు ప్రక్రియ వేగవంతమవుతుంది, ఆలస్యం తగ్గుతుంది, అలాగే బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లే ఇబ్బంది తగ్గుతుంది.
ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని నేరాలను నిర్భయంగా ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ కోరారు. నారాయణపేట జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు కట్టుబడి పనిచేస్తున్నారని తెలిపారు.
ఫోటో రైట్ అప్:7.ఎస్పీ వినీత్
_____________________
