ప్రజా యోధుడు గుమ్మడి నరసయ్యకి గౌరవ డాక్టరేట్
ఎమ్మెల్యేగా 5 సార్లు గెలిచినా మారని సామాన్య జీవనం
నిస్వార్థ సేవకు దక్కిన అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారిచే గుర్తింపు
కొత్తగూడెం : లోకల్ గైడ్ :
పదవులు మనుషులకు అహంకారాన్ని ఇస్తాయి. ఆయనకు మాత్రం బాధ్యతను ఇచ్చాయి. అధికారం ఉంటే కార్ల కాన్వాయ్లు, గన్‌మెన్ల హడావిడి కనిపిస్తుంది, ఆయనకు మాత్రం పాత సైకిల్, ఆర్టీసీ బస్సు ప్రయాణమే తోడయ్యాయి. ఆతనే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే పీడిత ప్రజల గొంతుక గుమ్మడి నరసయ్య. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరాడంబరతకు నిలువుటద్దంగా నిలిచిన ఈ ప్రజా యోధుడికి అరుదైన గౌరవం దక్కింది. చెన్నైకి చెందిన అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారు ఆయన నిస్వార్థ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పురస్కారానికి దక్కిన గౌరవం! నేటి రాజకీయాల్లో పదవి వస్తే కోట్లు గడించే వారున్న తరుణంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఇప్పటికీ ఒక సామాన్య రైతులా, సామాన్య ప్రయాణికుడిలా జీవిస్తున్న నరసయ్య గారి జీవనశైలి ప్రపంచానికే ఒక పాఠం. రాజకీయాల్లో నిజాయితీ అనే పదానికి ఆయన ఒక నిఘంటువులా నిలిచారు. ఆయన చేసిన ప్రజా పోరాటాలు, గిరిజన హక్కుల కోసం సాగించిన పోరు నేటికీ ఉద్యమకారులకు స్ఫూర్తిదాయకం. ఈ డాక్టరేట్ రావడం ఆయనకే కాదు, ఆయనను ప్రేమించే ప్రతి పేదవాడికి దక్కిన గౌరవంగా ఇల్లెందు ప్రజలు భావిస్తున్నారు. పదవులు రావచ్చు పోవచ్చు కానీ ప్రజల గుండెల్లో సంపాదించుకున్న స్థానం శాశ్వతం అని నిరూపించిన నాయకుడు గుమ్మడి నరసయ్య. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ఆయన గర్జించినా, బయట జనంతో కలిసి సామాన్యుడిలా నడిచినా అది ఆయనకే చెల్లింది. అభివృద్ధి ధ్యేయంగా, ప్రజా క్షేమమే ప్రాణంగా శ్రమిస్తున్న ఈ పెద్దాయనకు దక్కిన ఈ గౌరవం, ఆ పురస్కారానికే వన్నె తెచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.గుమ్మడి నరసయ్యకు డాక్టరేట్ ప్రకటించిన వార్త తెలియగానే ఇల్లెందు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. సోషల్ మీడియా వేదికగా, వ్యక్తిగతంగా అభిమానులు, రాజకీయ నాయకులు, మేధావులు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నారు. నిజాయితీకి పట్టాభిషేకం జరిగింది. ఒక ప్రజా యోధుడికి దక్కిన ఈ గౌరవం పట్ల అందరూ గర్వపడుతున్నారు.
