అశ్వారావుపేట, లోకల్ గైడ్ :
అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల సమరంలో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) తన దూకుడును ప్రదర్శించింది. మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా కాసాని నాగ శేష పద్మ, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో గురువారం భారీ జనసందోహం మధ్య నామినేషన్ దాఖలు చేశారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, గులాబీ జెండాల రెపరెపలతో అశ్వారావుపేట పురవీధులు హోరెత్తాయి. నామినేషన్ పర్వానికి ముందు రింగ్ రోడ్ నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, కాసాని చంద్రమోహన్ తదితర ముఖ్య నేతలు ముందుండి నడిచారు. ర్యాలీ అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో 8వ వార్డు అభ్యర్థిగా కాసాని నాగ శేష పద్మ తమ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. సాధారణ గ్రామ పంచాయతీగా ఉన్న అశ్వారావుపేటను మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసి, పట్టణ అభివృద్ధికి బాటలు వేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని తెలిపారు. రూ. 25 కోట్లతో సెంటర్ లైటింగ్, కోట్లాది రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం కేవలం బిఆర్ఎస్ హయాంలోనే సాధ్యమైందని, విద్యా, పాలనా సౌకర్యాలు, అశ్వారావుపేటకు డిగ్రీ కళాశాల, ఆర్టీవో ఆఫీస్ వంటి కీలక సంస్థలను తెచ్చిన ఘనత తమ పార్టీదేనని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కళ్యాణ లక్ష్మి, రైతుబంధు వంటి పథకాలు ప్రతి ఇంటికి ధీమాను ఇచ్చాయని కొనియాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 'ఆరు గ్యారంటీల' పేరుతో ప్రజలను మోసం చేస్తోందని మెచ్చా విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని, ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పై పూర్తి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని, ప్రస్తుతం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇది కాంగ్రెస్ పార్టీ పరాకాష్టకు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. అశ్వారావుపేట మరింత అభివృద్ధి చెందాలంటే మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరూ బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని 22 వార్డులు గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, సత్యవరపు సంపూర్ణ, ఉపాధ్యాయుల సూర్యప్రకాశ్రావు, మందపాటి రాజమోహన్ రెడ్డి, వగ్గెల పూజ, అంకోలు వెంకటేశ్వరరావు, జూపల్లి పద్మజ, సున్నం నాగమణి, జుజ్జురపు శ్రీరామ్మూర్తి, పాలవలస జీవన్ రావు, నారం రాజశేఖర్, నార్లపాటి శ్రీను, కట్రం స్వామి దొర, వివిధ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.