ప్రజాపాలన అట్టర్ ప్లాప్ - ప్రగతి ప్రణాళిక' ఓ పెద్ద ట్రాప్!
పాత దరఖాస్తులకే దిక్కులేదు - మళ్ళీ కొత్త నాటకాలా?
కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ యువజన నాయకుడు నారం రాజశేఖర్
అశ్వారావుపేట, లోకల్ గైడ్ :
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అంతా పచ్చి అబద్ధమని, ప్రజలను మరోసారి వంచించేందుకే ఈ కొత్త డ్రామాకు తెరలేపారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ యువజన నాయకులు, మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మల్లాయిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆరు గ్యారెంటీల పేరుతో ఊరూరా తిరిగిన ప్రభుత్వం, లక్షలాది దరఖాస్తులను సేకరించింది. తీరా చూస్తే ఆ దరఖాస్తులన్నీ ఇప్పుడు అధికారుల అల్మారాల్లో, చెత్తబుట్టల్లో మూలుగుతున్నాయన్నారు. పాత దరఖాస్తులకే అతీగతీ లేనప్పుడు, మళ్ళీ ప్రగతి ప్రణాళిక 99 రోజులు అంటూ ప్రజల ముందుకు వెళ్లడం సిగ్గుచేటని రాజశేఖర్ విమర్శించారు. వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు, ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ కొత్త కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. అసాధ్యమైన హామీలతో అధికారంలోకి వచ్చి, రెండేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఇచ్చిన వాగ్దానాల అమలుపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం, కేవలం కాలయాపన చేసేందుకే ఇలాంటి ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోందని, ప్రగతి ప్రణాళిక ఒక అబద్ధమని, ఇది అబద్ధాల పునాదులపై నిర్మించిన ప్రచారమని, దీనిని నమ్మడానికి ప్రజలేమీ అమాయకులు కారని ఆయన తెలిపారు. అసమర్థ పాలనతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం వచ్చిందని రాజశేఖర్ పిలుపునిచ్చారు. ప్రగతి పేరుతో చేసే ఆర్భాటాలను ప్రజలు నమ్మవద్దని, వాగ్దానాల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు.
