అశ్వారావుపేట, లోకల్ గైడ్ :
తరతరాలుగా భూమినే నమ్ముకుని బతుకుతున్న ఆదివాసీల ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోతుందా? పాలకుల హామీలు, అధికారుల చుట్టూ తిరిగినా వినతులు బుట్టదాఖలు కావాల్సిందేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రామన్నగూడెం గ్రామస్తుల ఆగ్రహం చూస్తుంటే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూసమస్యపై ఆదివాసీలు ఇప్పుడు మరో పోరాటానికి సిద్ధమయ్యారు. శనివారం గ్రామంలో అత్యవసరంగా సమావేశమైన గ్రామస్తులు, తమ భూమి హక్కుల కోసం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 23వ తేదీన జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని, ఐటీడీఏ పీవో, ఎమ్మెల్యే, అటవీ శాఖ ఉన్నతాధికారుల వరకు అందరికీ వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య నలుగుతున్న తమ భూములకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత మార్చి 15 వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నట్లు గ్రామస్తులు స్పష్టం చేశారు. మా భూమి మాకు దక్కాలి, మా హక్కులు మాకు కావాలి అనే నినాదంతో, ఒకవేళ గడువులోగా అధికారులు స్పందించకపోతే ఉగ్రరూపం దాల్చక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వీడకపోతే మార్చి 16 నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రామన్నగూడెం గ్రామ పంచాయతీ ఆదివాసీల ఆత్మగౌరవ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు మారడం లేదని, కాగితాల మీద హామీలు తప్ప, క్షేత్రస్థాయిలో మా భూములకు భరోసా లేదని అందుకే ఈసారి చావో రేవో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. తమ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం ఆదివాసీలు చేపడుతున్న ఈ పోరాటం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం, యంత్రాంగం మేల్కొని ఈ తీవ్రతరమైన భూసమస్యకు ముగింపు పలుకుతారా? లేక ఆదివాసీలను రోడ్డెక్కేలా చేస్తారా? అన్నది వేచి చూడాలి.