పుట్టినిల్లు గుర్రంగడ్డకు వెళ్ళిన శ్రీ జమ్ములమ్మ అమ్మవారు
జమ్మిచేడు సమీపంలో స్వయంభుగా వెలిసిన శ్రీ జమ్ములమ్మ, పరశురామస్వామి జాతర ప్రారంభమైంది..
By Ram Reddy
On
నడిగడ్డ ఇళవేల్పు, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతూ.. జిల్లా కేంద్రంలోని జమ్మిచేడు సమీపంలో స్వయంభుగా వెలిసిన శ్రీ జమ్ములమ్మ, పరశురామస్వామి జాతర ప్రారంభమైంది. జాతరలో భాగంగా మంగళవారం అమ్మవారిని ఆలయం నుండి అమ్మవారి పుట్టినిల్లు అయిన గుర్రంగడ్డ గ్రామానికి ఎద్దుల బండిపై ఊరేగింపుగా తోలుకొని వెళ్లారు. తిరిగి బుధవారం ఉదయం 8 గంటలకు గద్వాల మండలం గుర్రంగడ్డ గ్రామం నుండి అమ్మవారిని పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, బైనోళ్ల డప్పుల చప్పుళ్ళు, బాజా భజంత్రీలతో భక్తుల కోళాహాల మధ్య ఆలయానికి తోలుకొని వస్తారు. ఈ సందర్బంగా ఆలయ ఈఓ ఆర్.పురంధర్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా అమ్మవారి ఉత్సవాలు పౌర్ణమి రోజు నుండి ప్రారంభం అవుతాయన్నారు. సుమారు రెండు నెలల పాటు జరిగే ఉత్సవాలను తిలకించేందుకు నడిగడ్డ వాసులే కాక తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని ఆయన తెలిపారు. భక్తులు తమ కోరిన కోరికలు తీర్చుకునేందుకు అమ్మవారికి సుమారు నాలుగు నెలల పాటు మొక్కులు చెల్లిస్తారని చెప్పారు. ఏ శుభకార్యం తలపెట్టిన ముందుగా అమ్మవారికి పూజలు చేసిన తర్వాత ప్రారంభించడం ఇక్కడ ఆనవాయితిగా వస్తుందని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలవకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.
Tags:
About The Author
Latest News
09 Feb 2026 20:59:17
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో భారీగా నిధులతో అభివృద్ధి 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రమ్య జ్యోతి శ్రీకాంత్ ను గెలిపించండి.
