హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లకు స్టీమ్ రైస్ సరఫరా చేయాలని తెలంగాణ సివిల్ సప్లయ్స్ శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులకు అందించే భోజన నాణ్యత గణనీయంగా మెరుగుపడనుందని ఆ శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది విద్యార్థులు ఈ నిర్ణయం వల్ల లబ్ధి పొందనున్నారు. స్టీమ్ రైస్‌ను మిల్లులో ఆడించే ముందు ఆవిరితో ప్రాసెస్ చేయడం వల్ల గింజలు విరగకుండా దృఢంగా ఉంటాయి. దీంతో వండిన అన్నం రుచిగా, పొడిగా ఉండటంతో పాటు పోషక విలువలు కూడా మెరుగ్గా నిల్వ ఉంటాయి. సాధారణ బియ్యంతో పోలిస్తే స్టీమ్ రైస్ నాణ్యత అధికంగా ఉండటం వల్ల విద్యార్థులకు ఆరోగ్యకర మైన ఆహారం అందే అవకాశముంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహార భద్రత దృష్ట్యా ముఖ్యమైన అడుగుగా భావించవచ్చు. సంక్షేమ హాస్టళ్లు పాఠశాలల్లో భోజన నాణ్యతపై తరచూ వినిపించే విమర్శలకు ఇది సమాధానంగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. స్టీమ్ రైస్ వాడకం వల్ల వ్యర్థం తగ్గడంతో పాటు నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది. మొత్తం మీద ఈ నిర్ణయం విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు, విద్యా వాతావరణ మెరుగుదలకు దోహదపడ నుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను విద్యార్థుల తల్లి దండ్రులు, విద్యా వర్గాలు స్వాగతిస్తున్నాయి.