తల్లికి నివాళి –అమ్మానాన్న వృద్ధాశ్రమంలో అన్నదానంతో
మానవతా సందేశం ఇచ్చిన పర్లపల్లి లక్ష్మి కుటుంబం

తల్లిని స్మరించుకోవడం అనేది కేవలం కుటుంబ అనుబంధం మాత్రమే కాదు, సమాజానికి స్ఫూర్తినిచ్చే విలువైన కర్తవ్యమని చాటి చూపారు పర్లపల్లి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. తమ కన్నతల్లి పర్లపల్లి లక్ష్మి ఆరవ వర్ధంతిను పురస్కరించుకొని, ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మానాన్న సహాయ వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ట్రస్ట్ వ్యవస్థాపకుడు పర్లపల్లి నారాయణ, ట్రస్ట్ సభ్యురాలు పర్లపల్లి ఆశారాణి ఆధ్వర్యంలో ఉదయం వృద్ధులకు అల్పాహారం, రాత్రి భోజనం ఏర్పాటు చేశారు. సుమారు 70 మంది వృద్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. వృద్ధుల ముఖాల్లో చిరునవ్వులు కనబడటం తమకు నిజమైన సంతృప్తినిచ్చిందని పర్లపల్లి నారాయణ తెలిపారు.
అదే రోజు సాయంత్రం ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో 200 మందికీ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. సేవే పరమోన్నత ధర్మమనే భావంతో ప్రజలకోసం నిరంతరం సేవ చేయడమే తమ కుటుంబానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ఆదర్శ్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ కుసుమ భోగరాజు, ట్రస్ట్ కోఆర్డినేటర్ కుసుమ నాని, డాక్టర్ రఘు, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మేఘసిటీ అధ్యక్షుడు లయన్ సారంగం రాజేశ్, లైన్ సిహెచ్ సత్యనారాయణ రావు సీనియర్ అడ్వకేట్ హాజరైనారు.సేవ కార్యక్రమాలు సమాజంలో దయ, దాతృత్వం, ప్రేమను పెంపొందిస్తాయని, వృద్ధులను సంతోషపెట్టడం ద్వారా నిజమైన పుణ్యాన్ని సంపాదించవచ్చని వారు అభిప్రాయపడ్డారు. తల్లికి నివాళిగా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
