నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మార్చి 20 .(లోకల్ గైడ్
రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెలు, సంఖ్యలలో కేటాయింపులు ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి తప్పా ప్రజల జీవితాలలో ఎలాంటి మార్పు లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పేర్కొన్నారు. ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తుందని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను వర్తింప చేయడంలో జాప్యం చేస్తుందని చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఎక్కువ మొత్తంలో కనిపించిన అవి ఆచరణలో మాత్రం ఖర్చు కావడం లేదన్నారు. నల్లగొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి తగినన్ని నిధులను కేటాయించలేదన్నారు. నక్కల గండి డిండి ఎత్తిపోతల పథకమునకు బడ్జెట్లో ఈ రకంగా నిధులు కేటాయిస్తే పూర్తి కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందన్నారు. శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి కావడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. సాగర్ ఎడమ కాలువ మరియు ఎమ్మార్పీ సైడ్ కాలువల మరమ్మతులు చేయడానికి నిధులు కేటాయించాలన్నారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న చిన్న నీటి వనరుల ప్రస్తావన లేదన్నారు. గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖకు నిధులు కేటాయించినప్పటికీ అంతర్గత రోడ్ల నిర్మాణానికి తగిన నిధులను విడుదల చేయడం లేదన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడానికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు బడ్జెట్లో కేటాయించిన నిదులను చూస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లకు నిధులను కేటాయించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఇంత తక్కువ మొత్తంలో కేటాయిస్తే ఈ వర్గాల ప్రజలు అభివృద్ధి కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందని ప్రశ్నించారు. వ్యవసాయ కార్మికులకు ఈ బడ్జెట్ లో నైనా సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తావా అన్న హామీ అమలు చేయాలన్నారు. నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వాలన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటారో బడ్జెట్లో చెప్పలేదన్నారు. మహిళా సంక్షేమానికి డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదుగుదలకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టలేదన్నారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి ఈ రకంగా బడ్జెట్ కేటాయిస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందని ప్రశ్నించారు. విద్య, వైద్య రంగాలకు ఈ రకంగా కేటాయింపులు చేస్తే జిల్లా కేంద్ర ంలో ఉన్న వైద్య కళాశాలకు, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నిధులను తక్కువ కేటాయించారని చెప్పారు. మొత్తంగా బడ్జెట్ను పరిశీలిస్తే రాబడికి పోబడికి తేడా ఉందన్నారు. ఖర్చులకు తగ్గట్లుగా ఆదాయం ఏరకంగా సమకూర్చుకుంటారో బడ్జెట్లో చెప్పలేదన్నారు. అంకెల్లో కేటాయింపులు చేసి ఖర్చులు పెట్టలేదన్నారు. అలా జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించాలని చెప్పారు. నిర్దిష్టంగా బడ్జెట్ను ప్రజాసంక్షేమానికి, ప్రజల అవసరాల తగ్గట్టుగా కేటాయించేందుకు ప్రజలు నిర్మాణాత్మక పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.