విద్యాలయ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.శుక్రవారం జిల్లాలోని నెన్నెల మండల కేంద్రంలో కొనసాగుతున్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం అకాడమిక్ బ్లాక్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తు అనేక కార్యక్రమాలు చేపడుతుందని ఈ క్రమంలో పాఠశాల అకాడమిక్ బ్లాక్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు,సిబ్బంది,విద్యార్థుల హాజరు పట్టికలు,తరగతి గదులు,పాఠశాల పరిసరాలను పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడుతు సబ్జెక్టులలో ప్రశ్నలు అడిగి వారి అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం,శుద్ధమైన త్రాగునీటితో పాటు నాణ్యమైన విద్య బోధన అందించాలని,పాఠశాలలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు.గ్రామంలో 99రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని,మురుగు కాలువల వ్యవస్థ,పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.మండల కేంద్రంలోని నర్సరీ,సెగ్రిగేషన్ షెడ్ లను సందర్శించి మొక్కలు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో నీటిని అందించి మొక్కలను పరిరక్షించాలని తెలిపారు.ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి తడి,పొడి చెత్తలను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని,ఉపయోగకరమైన చెత్తను వేరుచేసి సెగ్రికేషన్ షెడ్లకు తరలించాలని తెలిపారు.ఈ అంశాల సమర్థవంతమైన నిర్వహణపై నిర్వాహకులను అభినందించారు.మండలంలోని చిత్తాపూర్ గ్రామంలో గల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు.విద్యార్థులకు సకాలంలో పౌష్టికాహారం అందిస్తు నాణ్యమైన విద్యాబోధన చేయాలని,విద్యార్థుల ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.విద్యార్థులతో మాట్లాడుతు సబ్జెక్టులలో ప్రశ్నలు అడిగి,మధ్యాహ్న భోజనం నాణ్యత,సౌకర్యాల కల్పన అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఏకాగ్రతతో చదివి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని,ఉన్నత స్థాయికి ఎదిగే దిశగా ఏకాగ్రతతో కృషి చేయాలని తెలిపారు.మధ్యాహ్న భోజనం తయారీ తీరును పరిశీలించి సిబ్బంది శుభ్రత నిబంధనలు పాటించాలని,ఆహారం తయారీలో తాజా కూరగాయలు,నాణ్యమైన నిత్యావసర సరుకులు వినియోగించాలని సూచించారు.పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించే విధంగా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.అనంతరం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల పఠన సామర్థ్యాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.కలెక్టర్ వెంట మండల పరిషత్ అభివృద్ధి అధికారి మొహమ్మద్ అబ్దుల్ హై,మండల పంచాయతీ అధికారి,పంచాయితీ కార్యదర్శి,సర్పంచ్,సంబంధిత శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.
