2.86 కోట్ల ఇళ్లకు విద్యుత్
ఎలక్ట్రానిక్స్ తయారీలో రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు
భారీగా పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు లోక్ సభలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి ప్రశ్నలకు ఇద్దరు కేంద్ర మంత్రుల వివరణ
లోకల్ గైడ్ :
న్యూ ఢిల్లీ సౌభాగ్య పథకం అనంతరం మిగిలిన గృహాల విద్యుదీకరణకు తీసుకున్న చర్యలు, అలాగే దేశంలో ఎలక్ట్రానిక్స్ దిగుమతులు–ఎగుమతుల పరిస్థితిపై లోక్‌సభలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అడిగిన రెండు వేర్వేరు ప్రశ్నలకు కేంద్రం లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చింది. విద్యుత్ సౌకర్యాల కల్పనకు సంబంధించిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, ఎలక్ట్రానిక్స్ & ఐటీ రంగానికి సంబంధించిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద వివరాలు వెల్లడించారు.
విద్యుద్దీకరణకు సంబంధించి దీన్ దయాళ్ పథకం ద్వారా..
దేశంలోని అన్ని నివాస గ్రామాలకు ఇప్పటికే విద్యుదీకరణ పూర్తిచేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, సౌభాగ్య పథకాల ద్వారా దేశవ్యాప్తంగా 2.86 కోట్ల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు అందించగా, ఎల్‌డబ్ల్యూఈ ప్రభావిత ప్రాంతాల గృహాలూ ఇందులో భాగమయ్యాయని తెలిపింది. 2022 మార్చి 31 నాటికే ఈ కార్యక్రమాలు ముగిసినట్లు వెల్లడించింది.
గ్రిడ్ సౌకర్యం అందుబాటులో లేని అటవీ ప్రాంతాల్లో..
ఆఫ్-గ్రిడ్ సోలార్ విధానాన్ని అమలు చేస్తూ మిగిలిన గృహాలకు విద్యుత్ అందిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో 8,823 గిరిజన గృహాలకు పనులు మంజూరు చేయగా, పీవీటీజీ వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొంది.
ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడుల వెల్లువ
దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని బలోపేతం చేయడానికి చేపట్టిన చర్యలకు విశేష స్పందన లభిస్తోంది. 2025లో ప్రారంభించిన ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్స్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్ కు 249 దరఖాస్తులు అందగా, రూ.59,350 కోట్ల లక్ష్యాన్ని మించి రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో ఈ పథకానికి కేటాయించిన బడ్జెట్‌ను రూ.22,919 కోట్ల నుంచి రూ.40,000 కోట్లకు పెంచినట్లు కేంద్రం వెల్లడించింది.
2030 లక్ష్యం… భారీ ఉపాధి అవకాశాలు
నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం 2030 నాటికి దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ విలువ 500 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. ఈ వృద్ధి వల్ల సుమారు 60 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని వివరించింది.
*నైపుణ్యాల పెంపుతో అవకాశాలు
ఎలక్ట్రానిక్స్ రంగంలో నైపుణ్యాభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటివరకు 4.93 లక్షల మంది శిక్షణ పొందగా, 3.75 లక్షల మందికి సర్టిఫికేషన్ అందింది. నీలిట్ ద్వారా ఆధునిక సాంకేతిక కోర్సులు అందిస్తూ యువతకు అవకాశాలు విస్తరిస్తున్నట్లు వివరించింది.
