సైబరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
దుండిగల్ తప్పిపోయిన ఓ 8 సంవత్సరాల బాలికను దుండిగల్ పోలీసులు అత్యంత వేగంగా స్పందించి క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. దుండిగల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మంజు దేవి ప్రస్తుతం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిమైసమ్మ వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆమె కుమార్తె (8) ఫిబ్రవరి 09 ఉదయం 11 గంటల సమయంలో కాలనీలో ఆడుకుంటూ వెళ్లి తప్పిపోయింది. సమీప ప్రాంతాలలో కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ బాలిక ఆచూకీ లభించకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు డయల్-100 ద్వారా దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే దుండిగల్ పీఎస్ పెట్రోల్ మొబైల్-1 సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని పరిసర ప్రాంతాలలో విస్తృతంగా గాలించారు. కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే బాలిక ఆచూకీని గుర్తించి సురక్షితంగా తల్లికి అప్పగించారు. తమ కుమార్తెను క్షేమంగా అప్పగించి నందుకు బాలిక తల్లి మంజు దేవి దుండిగల్ పోలీసుల తక్షణ స్పందనను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల భద్రత, ముఖ్యంగా చిన్నారుల రక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని ఈ ఘటన మరోసారి నిరూపించిందని స్థానికులు ప్రశంసించారు.