వ్యసన బాధితులకు అండగా అడిక్షన్ సెంటర్
కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో కౌన్సిలింగ్, ట్రీట్మెంట్ కేంద్రాల ప్రారంభం
బాధితులకు సమగ్ర చికిత్స అందించాలి ....జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రికొత్తగూడెం, లోకల్ గైడ్ :
మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్, అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కేంద్రాలను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యసన బాధితులకు సమగ్ర చికిత్స, పునరావాస సేవలు అందించేందుకు ఈ కేంద్రం వేదికగా నిలుస్తుందన్నారు. నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక వైద్యం, నిరంతర కౌన్సిలింగ్ ఇక్కడ అందుబాటులో ఉంటాయని వివరించారు. అనంతరం చికిత్స కోసం వచ్చిన ఒక బాధితుడితో కలెక్టర్ స్వయంగా మాట్లాడారు. మద్యం మానే క్రమంలో ఎదురయ్యే వణుకుడు, ఫిట్స్ వంటి ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకుని, బాధితులకు ధైర్యం చెప్పారు. ఇలాంటి కేసుల్లో అనుసరించాల్సిన వైద్య విధానాలు, కౌన్సిలింగ్ ప్రక్రియపై అక్కడి వైద్యులతో కలెక్టర్ చర్చించారు. బాధితులు వ్యసనాల నుంచి పూర్తిగా విముక్తులయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ ఉండాలని
ఆదేశించారు. డ్రగ్స్ కంట్రోల్ అండ్ రెగ్యులేటరీ స్ట్రెంగ్తెనింగ్ డే లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో విజేతలకు కలెక్టర్ ప్రశంస పత్రాలు, షీల్డ్ లను అందజేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఈ దిశగా స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులు బాధితులను ప్రోత్సహించి కేంద్రం సేవలను వినియోగించుకునేలా చూడాలని, యువతలో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై నిరంతర అవగాహన అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్, డాక్టర్ రాధిక, డాక్టర్ రాధా మోహన్, ఇతర వైద్య సిబ్బంది మరియు అధికారులు పాల్గొన్నారు.
