అశ్వారావుపేట అభివృద్దే లక్ష్యం ....
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
అశ్వారావుపేట, లోకల్ గైడ్ :
నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం మండలంలోని పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. పర్యటనలో భాగంగా తొలుత రెడ్డిగూడెం పంచాయతీలోని కొండరెడ్డి గిరిజన కుటుంబాలను ఎమ్మెల్యే కలిశారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తూ పేదలు, గిరిజనులు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. అనంతరం చెన్నాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులను ఆశీర్వదించారు. గ్రామాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా ఎమ్మెల్యే కీలక అడుగులు వేశారు. నారాయణపురం, కోయరంగాపురం, గుమ్మడవల్లి, బచ్చువారిగూడెం, తిరుమలకుంట, మామిళ్లవారిగూడెం, ఊట్లపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించబోయే సిసి రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. మట్టి రోడ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వినాయకపురం ముత్యాలమ్మ ఆలయ సమీపంలో నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించడంతో పాటు, భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. త్వరలో జరగనున్న చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లపై అధికారులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మండలంలో జరుగుతున్న పలు వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ పర్యటనలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మా రాంబాబు, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, ఎమ్మార్వో రామకృష్ణ, ఎంపీడీవో అప్పారావు, వివిధ శాఖల అధికారులు ఏఈలు, ఏడీలు, కాంగ్రెస్ నాయకులు మరియు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
